Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
- కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత నిర్వహణ
- సిలబస్ కుదింపు..చాయిస్..సమయం పెంపు
- 5 నిమిషాలు ఆలస్యమైనా నో ప్రాబ్లం..
- గంట ముందు నుంచే అనుమతి..రవాణా సౌకర్యం
- జిల్లా వ్యాప్తంగా 17,543 మంది విద్యార్థులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్మీడియెట్‌కు అనుమతించారు. కానీ ఈ ఏడాది పరిస్థితులు మెరుగవడంతో ఎప్పటిలాగే ఎగ్జామ్స్ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తం అయింది. సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండేళ్లుగా ప్రత్యక్ష బోధన, తరగతులకు దూరమైన విద్యార్థులు ఈసారి బోర్డు ఎగ్జామ్స్‌కు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి 'టెన్'షన్ పడాల్సిన అవసరం లేకుండా ఎస్ఎస్సీ బోర్డు తదనుగుణమైన మార్పులు చేసింది. సిలబస్ తగ్గించడంతో పాటు ఎగ్జామ్ ప్యాట్రన్‌ను కూడా మార్చింది. గతంలో ఉన్నదాని కంటే 75శాతం సిలబస్ తగ్గించారు. గతంలో ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లుంటే వాటిని ఒకదానికే పరిమితం చేశారు. చాయిస్‌తో పాటు ఎగ్జామ్ సమయాన్ని కూడా పెంచారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించడంతో పాటు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి తాపం నుంచి విద్యార్థులను రక్షించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు.. ఉచిత బస్సు సౌకర్యాన్ని సైతం కల్పించారు. టెన్త్ విద్యార్థులను ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు పరీక్ష విధానం, నిర్వహణలో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 17,543 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు...
జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 17,543 మంది విద్యార్థుల కోసం 104 కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో 80, ప్రయివేటు స్కూల్స్‌లో 24 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థల నుంచి 11,029, ప్రయివేటు స్కూల్స్ నుంచి 6,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. 104 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 1003 మంది ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తారు.
- 144 సెక్షన్...వేసవి ఏర్పాట్లు...
ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచి పంపుతారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా లోనికి అనుమతిస్తారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎవరైనా వేసవి తాపం బారిన పడితే తక్షణం వైద్య సిబ్బంది ప్రథమచికిత్స చేస్తారు. పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపించి ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు.
తగ్గిన సిలబస్..
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో సిలబస్‌ను కూడా తగ్గించారు. చాయిస్ ప్రశ్నలు పెంచారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా పరీక్ష సమయాన్ని సైతం గతం కంటే 15 నిమిషాలు పెంచారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించారు.
టెన్షన్ అవసరమే లేదు : యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. గత రెండేళ్లుగా బోర్డు ఎగ్జామ్స్ లేకపోవడం, ఈ ఏడాది ఆలస్యంగా తరగతులు ప్రారంభమైన దృష్ట్యా పరీక్షా విధానంలో అనేక వెసులుబాట్లు కల్పించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో తదనుగుణమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు, పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లు కేంద్రానికి తీసుకురావద్దు.