Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవస్థలు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ - బోనకల్
నెలరోజులుగా సైడ్ డ్రైనేజీ మురికినీరు నడిరోడ్డుపై ప్రవహిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామ పంచాయతీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామపంచాయతీలో పరిధిలో ఓ వీధిలో సైడ్ డ్రైనేజీకి ఇరువురు వ్యక్తులు తమ ఇంటి ముందు నుంచి మురికి నీరు వెళ్తున్నాయని, దీనివలన దుర్వాసన వస్తుందని వారి వారి ఇంటి ముందు సైడ్ డ్రైనేజీ మురుగునీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేశారు. దీంతో సైడ్ డ్రైనేజీలో ప్రవహిస్తున్న మురికి నీరు నడిరోడ్డుపై నెలరోజులుగా ప్రవహి స్తున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలంద దుర్వాసనతో నివసించ లేక పోతున్నామని తెలిపారు. అయితే సైడ్ డ్రైనేజీ లోనే మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఉంది. ఒకవేళ మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలితే ఈ మురికి నీరు మంచి నీటి పైప్ లైన్ లోకి పోతాయని, దీనివల్ల కూడా తమకు నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఆ రోడ్డుపై నడిచే పరిస్థితి కూడా లేకుండా దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు తెలిపారు. ఇదే విషయం గ్రామ పంచాయతీకి తాము ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ముష్టి కుంట గ్రామం లో కూడా ఇటువంటి దయనీయ దుస్థితి ఏర్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చు కాని పనిని కూడా నెలల తరబడి పరిష్కారం చేయకపోవడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, పరిష్కారం కోసం మరోమార్గం లేకనే తాము నవతెలంగాణను ఆశ్రయించామని స్థానికులు తెలిపారు. గ్రామపంచాయతీ సైడ్ డ్రైనేజీ కి అక్రమంగా అడ్డుకట్ట వేసిన వారిపై చర్యలు తీసుకొని, సైడ్ డ్రైనేజి మురికినీటిని సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.