Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా సమస్యలు వెల్లువ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రతీ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ఈ ఏడాది శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జెడ్.పి చైర్మన్ కోరం కనకయ్య నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో లాంఛనంగా ప్రారంభించారు. ఉదయమే మండల పరిషత్ కార్యాలయంలో అల్పాహారం స్వీకరించిన ఆయన అశ్వారావుపేట మేజర్ పంచాయితీ పాలకవర్గం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. పంచాయితీ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పట్టుబడ్డ వాహనాలు వాటి మధ్య పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని గమనించిన కనకయ్య ఆ ప్రాంతం శుభ్రం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ వాహనాలు నిలపడానికి రక్షిత ప్రదేశం కావాలని పోలీసులు కోరుతున్నారని ఈ.ఒ హరిక్రిష్ణ ఆయన దృష్టికి తీసుకు రాగా స్థలం కేటాయించాలని మండల ప్రత్యేక అధికారి ఆర్.డి.ఒ స్వర్ణలత కు సూచించారు.
గుమ్మడవల్లిలో జరిగిన పాదయాత్రలో ఆయన వీధులను క్షుణ్ణంగా పరిశీలించి పారిశుధ్యం నిర్వహణ వైఫల్యం గమనించి స్థానిక అధికారులపై అసహనం వ్యక్తం చేసారు. ఇక్కడ జరిగిన గ్రామ సభలో మిషన్ భగీరథ మంచినీరు సక్రమంగా సరఫరా అవడవంలేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మత్తులకు లోనైందని, దానిని పునరుద్ధరించాలని సాగు దారులు వినతి పత్రం ఇచ్చారు. కేసప్పగూడెంలో జరిగిన గ్రామసభలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజన పంచాయితీ అయినప్పటికీ రెవిన్యు పరంగా నాన్ ఏజన్సీ కావడంతో ఏజెన్సీ దృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, ఈ కారణంగా అర్హత ఉన్నా రిజర్వేషన్ లు వినియోగించుకోలేక పోతున్నామని ఈ గ్రామం గిరిజనులు గోడు వెళ్ళ పోసుకున్నారు. మా పంచాయితీని ఏజన్సీ ఏరియా గా నోటిఫై చేయాలని కోరం కనకయ్య, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎం.పి.పి శ్రీరామ మూర్తి, జెడ్.పి.టి.సిలు వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, ఎండిఒ విద్యాధరరావు, ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు, సర్పంచ్లు అట్టం రమ్య, కొడిమి సీత, కొమరం బాబురావు, ఎంపిటిసి వల్లెపు తిరుపతి రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.