Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్ ఫెయిర్ రెండో రోజున జోరుగా పుస్తక కొనుగోళ్లు
- ఆలోచింపజేసిన ''వనితావరణం'' చర్చ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తెలుగు సాంస్కృతిక అకాడమీ, ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖమ్మం బుక్ ఫెయిర్ లో జాతశ్రీ వేదికపై పమ్మి రవి బందం ప్రదర్శించిన ధూంధాం - ఆట పాట సాంస్కృతిక కార్యక్రమాలతో రెండో రోజూ ఆకట్టుకుంది. అమ్మ, మానవజీవితం, చదువు గొప్పతనం, సమాజం- ఆధునికత ప్రభావాలపై పాడిన పాటలు ఆలోచింపజేశాయి. కూచిపూడి నృత్యం, భరతనాట్యం, జానపద నృత్యాలు, జానపద గీతాలతో కళాకారులు ఉర్రూతలూగించారు. ముఖ్యంగా రావెళ్ళ వెంకట రామారావు పైన పాడిన గీతం కనులను వర్షింపజేసింది. వనితావరణం పేర మనతో మనంగా స్త్రీ రచయితలు తాము సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నామో తమ నిర్దిష్ట అభిప్రాయాలతో తమ స్థానం ఎంత కీలకమైందో స్పష్టం చేశారు. ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అఫ్రోజ్ సమీనా విధాన నిర్ణయాలలో మహిళల పాత్ర గురించి, విధాన పరమైన స్థానం మహిళలకు దక్కాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంటా బయటా కనపడకుండా పడుతున్న ఒత్తిడి.. తద్వారా కలుగుతున్న అనారోగ్య సమస్యల గురించి దాని నుండి బయటపడి మహిళ తేలికగా జీవనం సాగించేలా ఎలా ఉండాలో డాక్టర్ రామినేని సబిత ఆత్మీయంగా సంభాషించారు. ఎఇఓగా విధులు నిర్వహిస్తున్న శిరణ్మయి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళల విజయాలు ఒత్తిడుల గురించి స్ఫూర్తివంతంగా చర్చించారు. న్యాయవాది, లా కాలేజిలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న రత్నాంబ ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సవాళ్ళు వారికి అండగా న్యాయపరమైన హక్కులు, చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుత్తా పద్మావతి మాట్లాడుతూ.. స్త్రీ విద్య ఆవశ్యకత గురించి వివరించారు. ప్రతి మహిళ విద్యావంతురాలైతేనే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. సామాజిక కార్యకర్త పారుపల్లి ఝాన్సీ ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఖమ్మం కవయిత్రులు, రచయిత్రులు ఫణిమాధవి కన్నోజు, రూపరుక్మిణి, సునంద వురిమళ్ళ, తోట సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు సీతారాం,ప్రసేన్, అట్లూరి వెంకటరమణ, ఐ.వి.రమణారావు, రవిమారుత్ పర్యవేక్షించారు.