Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షం వస్తే మునక లో 'దళిత కాలనీ'
- రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్న 'దళితులు'
- మండల పరిషత్తు సమావేశంలో ఎమ్మెల్సీ మధు హామీ
నవ తెలంగాణ - బోనకల్
ఎండోమెంట్ పొలం దళితులకు శాపంగా మారింది. వర్షం వస్తే మునక లో దళిత కాలనీ. రెండేళ్లుగా దళితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ గ్రామ సర్పంచ్ ప్రతి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తుతున్నారు. సమస్య పరిష్కారం కావడం లేదు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని, వారం రోజులలో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. సర్పంచ్, దళిత కాలనీ వాసుల రోదన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. దళిత కాలనీవాసులు, ఆ గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని గోవిందపురం ఏ గ్రామంలో ఈ సమస్య నెలకొని ఉంది. గోవిందా పురం ఏ గ్రామంలో దళిత కాలనీ ఉంది. ఈ దళిత కాలనీలో సుమారు వంద కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.ఇక్కడ నుంచే అసలు సమస్య ప్రారంభమైంది. దళిత కాలనీ కి ఎగువ భాగంలో రెండు భాగాలుగా ఆరు ఎకరాల లో ఎండోమెంట్ పొలం ఉంది. ఈ పొలం దళిత కాలనీ కి ఆనుకొని ఉంది. కానీ దళిత కాలనీకి, ఎండోమెంట్ పొలానికి స్పష్టమైన సరిహద్దులు మాత్రం లేవు. ఎండోమెంట్ పొలం ఎగువ భాగాన ఉండటం, దళిత కాలనీ దిగువ భాగాన ఉండటంతో ఏ మాత్రం చిన్న వర్షం వచ్చినా ఆ నీరంతా దళిత కాలనీ లోకి చేరుతుంది. ఒకవేళ తుఫాన్ వచ్చిన సమయంలో లేదా పెద్ద వర్షం వస్తే ఆ వరదనీటితో కాలనీ మొత్తం నీటి మయం అవుతుంది. ఆ కాలనీ మొత్తం ఓ చెరువులా తలపిస్తుంది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే దళిత కాలనీవాసులు వణికిపోతున్నారు. ఈ విషయంపై దళితులు అనేకసార్లు ప్రజాప్రతినిధుల, అధికారుల దష్టికి తీసుకెళ్లారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని దళితుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందాపురం ఏ గ్రామ సర్పంచ్ గా భాగం శ్రీనివాసరావు ఎన్నికైన తర్వాత ఈ సమస్య పరిష్కారం కోసం నడుంబిగించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేక సార్లు రెవిన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ నెల 19వ తేదీ బోనకల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ తాత మధుసూదన్ హాజరయ్యారు. దీంతో సర్పంచ్ పట్టుదలతో ఈ సమస్యను సమావేశంలో లేవనెత్తారు. దీంతో తాత మధు స్పందిస్తూ తాసిల్దార్ రావూరి రాధికను సమస్య పరిష్కారం కోసం అడ్డంకులు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ఎండోమెంట్ పొలం హద్దులను రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తే, ఆ హద్దుల ప్రకారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎండోమెంట్ పొలములో గల వర్షపు నీరు దళిత కాలనీలో కి రాకుండా అడ్డుకట్ట నిర్మిస్తామని, దీంతో ఆ నీరు దళిత కాలనీలో కు సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతుంద ని తెలిపారు. సర్వే కోసం ఆలస్యం ఎందుకని రెవెన్యూ అధికారులను తాతా మధు ప్రశ్నించారు. దీంతో నాగపూర్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేలో మండల సర్వేయర్, గీర్దావర్లు ఉండటం వల్ల ఎండోమెంట్ భూమి సర్వే చేయలేకపోతున్నామని సమాధానం చెప్పారు. దీంతో మధు స్పందిస్తూ ఈ విషయంపై తాను కలెక్టర్ తో మాట్లాడతానని ఎన్ని రోజులలో సర్వే చేస్తారని ప్రశ్నించారు. దీంతో వారం రోజులలో సర్వే చేసి హద్దులు నిర్వహిస్తామని రెవెన్యూ అధికారులు ఆమె హామీ ఇచ్చారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్య ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో దళితులు, ఆ గ్రామ సర్పంచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండోమెంట్ భూమి సర్వే నిర్వహించి హద్దులు తేల్చిన వెంటనే తాను సమస్య పరిష్కారం చేస్తానని సర్పంచ్ శ్రీనివాసరావు కోరారు.