Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ రోహిత్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సీ.హెచ్ దశరథ రాజు అలియాస్ దశరధుడు, నాగులు కొంతకాలంగా గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఎస్సై చల్లా అరుణ అశ్వారావుపేట-జంగారెడ్డిగూడెం రోడ్డులోని కాకతీయ గేటు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన పాత దొంగలు ఇరువురు పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎస్సై అరుణ సిబ్బందితో వెంబడించి పట్టుకున్నారు. దొంగలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వారి నుండి రెండు ద్విచక్ర వాహనాలు,48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం పరుచుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుల కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సీఐ బాలకృష్ణ, ఎస్సై చల్లా అరుణ పాల్గొన్నారు.