Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సహకార సంఘంలో 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై విచారణ జరపగా రూ.2,07,98,321 (రూ.2.07కోట్లు) అవినీతి జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడయిందని సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘం మహాజన సభ సమావేశంలో అధికారులు వెల్లడించారు. సంఘం చైర్మన్ ధర్మారెడ్డి, రైస్ మిల్లులతో కలిసి గత ఏడాది ధాన్యం కొనుగోలు చేయకుండానే చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్ము కాజేసిన విషయం తెలిసిందే. దీనిపై రూరల్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. సంఘం చైర్మన్, సీఈవో ఒకరిపై మరొకరు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులతో జిల్లా అధికారులు సంఘంలో 2013 నుంచి ఇప్పటి వరకు అన్ని లావేదేవీలపై 51 విచారణకు ఆదేశించారు. అధికారులు ఆరునెలల పాటు విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విచారణ పూర్తి చేశారు. విచారణ నివేదికను వెల్లడించడం కోసం సంఘం కార్యాలయంలో శనివారం మహాజన సభను ఏర్పాటు చేశారు.
రైతులు ఆందోళన : సంఘంలో 700ల మంది రైతులు ఉంటే అందరికీ సమాచారం ఇవ్వలేదని, కోరం పూర్తి కాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని రైతులు ఆందోళన చేపట్టారు. సంఘంలో కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంటే రైతులకు ఇంత వరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సమావేశానికి జిల్లా అధికారులు రావాల్సిందేనని పట్టుబట్టారు. సంఘం పాలకవర్గ సభ్యులు అందరూ కలిసి రైతులకు నచ్చజెప్పి సమావేశం కానిచ్చేశారు.
నివేదికను వెల్లడించిన సీఈవో: సంఘం సీఈవో మహిముద్ ఆలీ
గతంలో పనిచేసిన సీఈవో నరసింహారావు రూ.61,23,061లు, గత చైర్మన్ మంకెన నాగేశ్వరరావు పేరుతో రూ.22,82,675లు, గత సీఈవో నరసింహారావు, ఇటీవల సస్పెండ్ అయిన చైర్మన్ ధర్మారెడ్డి' పేరుతో రూ.6,26,342లు, గత సీఈవో నరసింహారావు, ఇటీవల సస్పెండ్ అయిన చైర్మన్ ధర్మారెడ్డి,సంఘంలో పనిచేసే సిబ్బందితో కలిపి రూ.1,07,69,40లు, మిగతా సిబ్బంది, స్టాప్ పేర్లతో కూడా కొంత నగదు ఉన్నాయి. అన్నీ కలిపి రూ.2,07,98,321లు(2.07కోట్లు)అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడయిందని అధికారులు విచారణ నివేదికను చదివి వినిపించారు. అయితే వాటిల్లో కొన్ని వాస్తవంగా సంఘం కోసం ఖర్చులు చేసినప్పటికీ కొన్ని బిల్లులు సమర్పించడంలో ఆలస్యం అవ్వడం,కొన్ని బిల్లులు మాయం అయినట్లు అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విచారణ నివేదికపై పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి జిల్లా ఉన్నతాధికారులకు తీర్మానం కాపీని పంపించారు. విచారణలో వెల్లడైన వాటిల్లో తమ తప్పు ఏమీ లేదని అధికారులు, సిబ్బంది జిల్లా ఉన్నతాధికారులు వద్ద రుజువు చేసుకుంటే వాటికి సంబంధించిన నగదును అందులోంచి తొలగించే అవకాశం ఉంది. విచారణ నివేదికపై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ చైర్మన్ ఉరడీ హైమావతి, డైరెక్టర్లు అల్లిక వెంకటేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్, యండ్లపల్లి రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.