Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని సైతం ఎత్తివేసి 21 కోట్ల మంది వినియోగదారుల మీద మరింత భారం మోపడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఖండించారు. శనివారం ఖమ్మం సుందరయ్య భవన్లో జిల్లా ముఖ్యుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయివేటు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆయిల్, గ్యాస్‌పై నియంత్రణ ఎత్తేసిందని విమర్శించారు. ఆ తర్వాత గ్యాస్'పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం ప్రస్తుతం మొత్తం సబ్సిడీ ఎత్తేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం 8 శాతం పెరిగి ఒకపక్క ప్రజల జీవన వ్యయం పెరుగుతుంటే మరోపక్క 21 కోట్ల గ్యాస్ వినియోగదారులకు కొద్దిపాటిగా ఇస్తున్న సబ్సిడీని సైతం ఎత్తేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. దేశంలో 30 కోట్లకు పైగా వంటగ్యాస్ వినియోగదారులున్నారని, ఉజ్వల పథకం కింద ఉన్న తొమ్మిది కోట్ల గ్యాస్ వినియోగదారులకు మాత్రమే పరిమిత సబ్సిడీ వర్తింపజేసి మిగతావారికి ప్రస్తుతమున్న సబ్సిడీని ఎత్తేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు సతమతమవుతుంటే, ఉన్న సబ్సిడీలను ఎత్తేయడమంటే ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమేనని విమర్శించారు. ఒకపక్క కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి వారిని ప్రపంచస్థాయి సంపన్నులు చేస్తూ, మరోపక్క పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ వినియోగదారులపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పన్నులు వేస్తున్నదని గుర్తు చేశారు. తక్షణమే వంటగ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలనీ, ప్రజా నిరసనలు, ఆందోళనల ద్వారా కేంద్రంపై పోరాడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతి, భుక్యా వీరభద్రం, బండి రమేష్, బొంతు రాంబాబు, వై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.