Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన కార్యాలయం నిర్మాణానికి యోచన
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సింగరేణి రుద్రంపూర్ ఏరియాలోని జీఎం కార్యాలయం నూతన భవనాన్ని కొత్తగూడెం 3 ఇంక్లైయిన్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేసిన యాజమాన్యం ప్రతిపాదన మార్చుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతన భవన నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కొత్తగూడెం సింగరేణి రుద్రంపూర్ ఏరియాలో గత ఆరు దశాబ్దాలుగా బొగ్గు గనుల నిర్వహణ జరిగింది. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని నిర్మించారు. 7,8,9 ఇంక్లైయిన్స్, ఆనందఖని, 5బి, 5షాప్ట్ తదితర భూ గర్భ బొగ్గు గనులు నిర్వహణ జరిగిన కాలంలో జనరల్ మేనేజర్ కార్యాలయం నిర్మించారు. 60 ఎండ్ల కాలంలో కార్మిక సంక్షేమం, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, గనుల నిర్వహణ, పారిశ్రామిక సంబంధాల నిర్వహణలో ఎంతో ప్రతిష్టాత్మకత సంతరించుకుంది. కాగా కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలో కాలక్రమీన అనేక భూగర్భ గనులు మూసి వేయగా, గత 25 సంవత్సరాల కాలం పాటు అధిక బొగ్గు ఉత్పత్తి చేసిన గౌతంఖని ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. తాజాగా వీటితో పాటు 5ఇంక్లైన్ ఇలాంటి భూగర్భ గని మూసి వేసి, 5బి గని నుండి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. క్రమంగా నిల్వలు తగ్గి, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో జనరల్ మేనేజర్ కార్యాలయం నుండి పరిపాలన కొనసాగింది. కాలక్రమేణా బొగ్గు నిక్షేపాలు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు గుర్తించారు. బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత పెరిగింది. జలగం వెంగళరావు (జేవిఆర్) ఓపెన్‌కాస్టు గనులు ఏర్పాడ్డాయి. కొత్తగూడెం రుద్రంపూర్‌లో బొగ్గు ఉత్పత్తి చేసే గనులు అంతరించిపోవడం, సత్తుపల్లిలో బొగ్గు నిక్షేపాలు మరో నలభై ఏళ్ళపాటు ఉత్పత్తి జరిగే అవకాశం ఉండటంతో సింగరేణి యాజమాన్యం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ఇతర విభాగాల కార్యాలయాలను సత్తుపల్లిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్తగూడెం వికే7 గని మూసివేసి, ఇదే ప్రాంతాన్ని ఓపెన్ కాస్ట్ గని నిర్వహణకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ మాసంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పర్యావరణ అనుమతులు లభించిన వెంటనే ఓసి నుండి బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గౌతమిఖని నుండి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియాలో బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో పరిపాలన విభాగం సత్తుపల్లి విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. సుమారు వెయ్యి మంది కార్మికులు ఆ ప్రాంతంలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సత్తుపల్లిలో మరో 40 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి సరిపడా నిల్వలు ఉండడం, ఎక్కువ కాలం బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశాలున్న నేపథ్యంలో జీఎం కార్యాలయం సత్తుపల్లిలో నిర్మించాలని యాజమాన్యం పటిష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో వికే ఓపెన్ కాస్ట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం కార్యాలయాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితోపాటు ఆర్సిహెచ్ బంకర్, ఇతర కార్యాలయాలు తొలగించి, ఇతర ప్రాంతాల్లో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీఎం కార్యాలయం నిర్మాణానికి త్రి ఇంక్లైయిన్ ప్రాంతంలో ఉన్న రెస్క్యూ స్టేషన్ పరిసరాల్లోని స్థలాన్ని పరిశీలించారు. నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. కానీ ఇటీవల అనూహ్యంగా జరిగిన మార్పుల నేపథ్యంలో సత్తుపల్లి తరలించాలని, నూతన కార్యాలయాన్ని సత్తుపల్లిలో నిర్మించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా మే 28వ తేదీన సత్తుపల్లి నుండి రైల్వే ద్వారా బొగ్గు రవాణా చేసి సింగరేణి యాజమాన్యం చరిత్రను సృష్టించింది. దీర్ఘకాలిక స్వప్నం నెరవేరింది. ఈ నేపథ్యంలో మరో 40-50 ఏళ్లపాటు పరిపాలనా వ్యవహారాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం నుండి సత్తుపల్లికి పరిపాన వ్యవహారాలు కష్టంగా ఉండే అవకాశం ఉన్న తరుణంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనే కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.