Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
చేస్తున్న వృత్తి పట్ల ప్రేమ, అంకిత భావం ఉంటే కొత్త పుంతలు తొక్కుతూ వృత్తి ధర్మాన్ని నెరవేర్చవచ్చు. సొంత లాభం కొంత మానుకుంటే వృత్తికి వన్నెలద్దవచ్చు. ఆషామాషీగా బెల్ అండ్ బిల్ అనుకోకుండా తాను చేస్తున్న వృత్తికి కొంతవరకైనా న్యాయం చేయాలనుకునే సంకల్పం ఉంటే చాలు పది మంది మన్ననలు పొందవచ్చు అని నిరూపిస్తున్నారు మండలంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీను, ఉపాధ్యాయురాలు కరుణలు ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 20 మంది విద్యార్థులు నమోదు అయ్యారు. కాగా పాఠశాలలో నమోదైన విద్యార్థులను ఆకర్షించడానికి వారిని నిలకడగా ఉంచడానికి సదరు ఉపాధ్యాయులు చేపట్టిన వినూత్న ప్రయోగం పలువురి ప్రశంసలను అందుకుంటుంది.
జ్ఞానాన్ని పెంచే బడి గోడలు
పాఠశాల గేటు దగ్గరకు వెళ్లగానే అక్షరాలు, స్వాగతిస్తాయి. గోడలపై సింగారించుకున్న చిత్రాలు, ముచ్చటిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే తరగతి గదుల్లో తెలుగు వర్ణమాల, ఆంగ్ల ఆల్ఫాబెట్స్ కన్పిస్తాయి. అదేవిధంగా పదాలతో కూడిన బొమ్మలు, తెలుగు, ఆంగ్లభాషలో పలకరిస్తాయి. గుణింతాలు, వాక్యాలు, జాతీయ నేతల రంగుల చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. తరగతి గదిలో అక్షర తోరణం ప్రధాన ఆకర్షణగా పేర్కొనవచ్చు. తరగతి గదుల గోడలన్నీ విజ్ఞానాన్ని అందించే సమాచారంతో నిండి ఉన్నాయి. ఆ గోడలపై ఉన్న విషయాంశాలు చదివితే చాలు. కొంత జ్ఞానమైన అబ్బుతుంది. ప్రైవేట్లు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సంకల్పించి ప్రభుత్వం సహ పాఠ్యాంశ బోధనోపకరణాలు (టీఎస్ఎంఎస్)ను ఉపయోగించి పాఠాలు చెప్పే విధానంపై కొంతకాలం క్రితం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. దీంతో గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆ విధానాన్ని ఆచరించి సత్ఫలితాలను సాధిస్తున్నారు.
సొంత సొమ్మును వెచ్చించి... శ్రద్ధ వహించి
పాఠశాలలోని తరగతి గోడల మొదలు. తరగతి గదులన్నింటిని తైల వర్ణ చిత్రాలతో నింపడానికి ఉపాధ్యాయులు తమ సొంత సొమ్మును వెచ్చించారు. సొంత లాభం కొంత మానుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలకు కొత్త హంగులు అద్దారు. పాఠశాలకు వచ్చే నిధులు అరకొరగా ఉండడంతో అవి ఏ మూలకు సరిపడకపోవడంతో ఉపాధ్యాయులే వీటిని గోడలపై రాయించడానికి సొంత సొమ్మును భరించారు. పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న వారి విద్యలో గుణాత్మక తను సాధించాలని, అందుకనుగుణంగా నాణ్యమైన బోధనలు అందిస్తున్నారు.
అంకిత భావం ఉంటే చాలు : బి.శ్రీను, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
గాంధీనగర్ పాఠశాలకు, పిల్లలకు మేలు చేయాలనే సంకల్పంతో పాటు, తదనుగుణంగా అంకిత భావం కనబరిస్తే చాలు, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు బడుల కన్నా మిన్నగా రాణిస్తాయి. సర్కార్ పాఠశాలలు బలోపేతమై ప్రజాధారణ పొందాలంటే ఉపాధ్యాయుల్లో వృత్తి నిబద్ధత, వృత్తి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి. పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ విద్యార్థులకు బోధించడం ద్వారా ఆ పాఠ్యాంశాలు సులువుగా అర్థం కావడంతో పాటు, ఎక్కువ కాలం గుర్తుంటాయి.