Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సమావేశం ఆదివారం జమలాపురం రైతుకు వేదికలో మండల వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి ఆదేశాలతో ఏఈఓ జిష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిష్ణు మాట్లాడుతూ రైతులందరూ వానాకాలం సాగును వ్యవసాయ అధికారుల ఆదేశాలతో నిర్వహించాలన్నారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, లైసెన్స్ పొందిన దుకాణదారుల వద్ద నుండి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదులు తమ పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచాలని తెలిపారు. హైబ్రిడ్ విత్తనాలను ఎట్టి పరిస్థితులలో రైతులు వాడవద్దని వాటికి భారత ప్రభుత్వం అనుమతులు లేవని వాటి వల్ల పలు రకాల వ్యాధులు వస్తాయని సూచించారు. వరిలో వెదజల్లే పద్ధతి ఎదపెట్టే పద్ధతులను పాటించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. రసాయనిక ఎరువులను తగ్గించి స్వచ్ఛమైన పశువుల ఎరువులను, వానపాముల కంపోస్టును రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులు తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారులకు సూచనలు సలహాలు పాటించి తమ పంటలు వేసుకోవాలని అధిక లాభాలు పొందాలని సూచించారు. రైతు అవార్డు గ్రహీత కుడుముల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాలని అన్నారు.సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాస్‌రావు, రాజుపాలెం చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, రాజుపాలెం సర్పంచ్ బూసి పల్లి వెంకటరెడ్డి, ఎంపీటీసీ దోమందుల సామేలు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, రాజుపాలెం, వెంకటాపురం, నారాయణపురం, జమలాపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు.