Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులోల టెట్ పరీక్ష నిర్వహణ, ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం మనపూరు మనబడి, దళితబంధు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం టెట్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహనం 12 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు 40 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 6509 మంది, అలాగే మద్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు 32 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 7238 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 8 రూట్లుగా విభజించి పర్యవేక్షణకు 8 మంది సీనియర్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 8 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 40 మంది ఛీఫ్ సూపరిండెంట్లు, 40 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, 120 మంది హాల్ సూపరింటెండ్లు, 440 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా సీటింగ్ కెపాసిటి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదటి పేపరుకు కొత్తగూడెంలో 15, పాల్వంచలో 9, ఇల్లందులో 6, భద్రాచలంలో 6, మణుగూరులో 4 కేంద్రాలు, అలాగే మధ్యాహ్నం నిర్వహించు రెండవ పేపరు పరీక్ష కు కొత్తగూడెంలో 15, పాల్వంచలో 9, భద్రాచలంలో 6, ఇల్లందులో 1, మణుగూరులో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విధులు నిర్వహించు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలని డీఈఓకు సూచించారు. మండల స్థాయిలో తహసిల్దార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని అదే మాదిరి టెట్ పరీక్ష నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ సోమశేఖరశర్మ, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.