Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకవర్గం అవినీతిపై విచారణకు సమాయత్తం?
- కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు అందడంతో బెంబేలు
- చనిపోయిన, సభ్యులు కాకున్నా రుణాలు మంజూరు
- ఆ లోన్లలో మూడొంతులు కాజేసినట్లు ఆరోపణలు
- 'ప్రెసిడెంట్ సస్పెన్స్ అకౌంట్' పేరుతో రాంగ్ట్రాక్
- 'రూల్' తప్పిన 51 ఎంక్వైరీ...పాలకవర్గానికి 'సహకారం'
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా టెలికం ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టీఈసీసీఎస్)లో చోటుచేసుకున్న రూ.50 లక్షల వరకు అవకతవకలపై ఈ సొసైటీ ఎక్స్అఫిషియో చైర్మన్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు గతేడాది డిసెంబర్లో ఫిర్యాదులందాయి. దీనిపై తక్షణం విచారణ చేసి రిపోర్టు ఇవ్వాల్సిందిగా జిల్లా సహకార అధికారి (డీసీవో)విజయ కుమారిని కలెక్టర్ ఆదేశించారు. ఆదేశాలిచ్చి ఆరునెలలైనా 17 మంది (వాస్తవానికి 15)మాత్రమే సభ్యులున్న టెలికం ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ పూర్తికాకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంక్షేమ నిధిలో నెలకొన్న అక్రమాలపై సీబీసీసీఐడీ విచారణ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో మంగళవారం నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ విషయంలో ఆడిటింగ్ నిర్వహించిన ఓ అధికారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి తతంగమే చోటుచేసుకోవడం...ఇక్కడి ఉద్యోగులు కూడా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, కేంద్రస్థాయిలోని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికం ఎంప్లాయిస్ క్రెడిట్ సొసైటీ పాలకవర్గం బెంబేలెత్తుతోంది. ముఖ్యంగా ఈ సొసైటీ ప్రెసిడెంట్ చాగంటి నాగమల్లు పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది.
నాటి నుంచి నేటి వరకు అవకతవకలకు అంతే లేదు...
ఆడిట్, కోఆపరేటివ్ ఆఫీసర్లు, పాలకవర్గం కుమ్మక్కై టెలికం ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఎన్ని రకాల అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పాలకవర్గం అధ్యక్షుడిగా ఉన్న ఉపాధ్యాయులు రూ.34 లక్షల వరకూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2010లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లను ఆయన ఆశ్రయించారు. దీన్ని అడ్డుపెట్టుకుని బీఎస్ఎన్ఎల్లో టీటీగా పనిచేస్తున్న చాగంటి నాగమల్లు వ్యూహాత్మకంగా పాలకవర్గం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అప్పటికే రూ.నాలుగైదు కోట్లతో నడుస్తున్న సొసైటీని తన చెప్పుచేతల్లోకి తీసుకుని 2011 నుంచి ఆడిందే ఆటగా సొసైటీ నిధులను పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది జనవరి 31న వీఆర్ఎస్ తీసుకున్న సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వారికి చెందాల్సిన థెఫ్ట్ డిపాజిట్లు, షేర్ కేపిటల్ ధనం కాజేసినట్లు ప్రెసిడెంట్‌పై ఆరోపణలున్నాయి. అంతేకాదు సొసైటీ క్లోజింగ్ పేరుతో అసత్యప్రచారం చేసి 78 మంది సభ్యత్వాలను నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, జనరల్‌బాడీ మీటింగ్ నిర్వ హించకుండా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందినప్పుడు సభ్యులు రుణ బకాయిలను పూర్తిగా చెల్లించాల్సి ఉం టుంది. అప్పులేనట్లు నోడ్యూ సర్టిఫికెట్ పొంది తేనే ఉద్యోగుల రిటైర్మెంట్ను ఆమోదించాలి. కానీ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి ప్రెసిడెంట్ నోడ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.
'ప్రెసిడెంట్' సస్పెన్స్ అకౌంట్ పేరుతోనూ కాజేత...
'ప్రెసిడెంట్' సస్పెన్స్ అకౌంట్ పేరుతోనూ నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకూ ఇలా స్వాహా చేసినట్లు చెబుతున్నారు. ప్రతియేటా రూ.వెయ్యి నుంచి రూ.2వేల కంటే ఎక్కువగా ఈ సస్పెన్స్ అకౌంట్ చూపించ కూడదు. అవి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. కానీ ప్రతియేటా రూ.లక్షలు కాజేస్తున్నట్లు ఆడిట్ రిపోర్టులు చెబుతున్నాయి. 2014-15లో ప్రెసిడెంట్ సస్పెన్స్ అకౌంట్ పేరుతో రూ.4.62 లక్షలు, 2015-16లో 2లక్షలు, 2016-17లో 1.84 లక్షలు, 2017-18లో 1.07లక్షలు, 2018-19లో 1.13 లక్షలు, 2019-20లో రూ.2.25 లక్షలు దుర్వినియోగమైనట్లు వెల్లడైంది. దీనిపై 2020-21లో రూల్ 51 ఎంక్వైరీ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాక రూ.660కి ప్రెసిడెంట్ సస్పెన్స్ అకౌంట్ పరిమితమవడం గమనార్హం.
చనిపోయినా...సభ్యులు కాకున్నా లోన్లు...
చనిపోయిన, పాలకవర్గం బంధువులు, రిటైర్డ్ అయిన సభ్యులకూ లోన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సభ్యుల వేతనాన్ని బట్టి గరిష్ట మొత్తంగా రూ.25వేల వరకూ లోన్ సీలింగ్ ఉండగా రూ.3 లక్షలు రుణాలు ఇవ్వడం గమనార్హం. ఈలోన్లపై 1% మాత్రమే వడ్డీ వసూలు చేయాల్సి ఉండగా రూ.18% వడ్డీ వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. కాగా ఇలా ఇచ్చిన లోన్లలోనూ అధిక మొత్తం ప్రెసిడెంటే కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లోన్లనూ అనుకూలమైన వారికే ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక చనిపోయిన, రిటైర్డ్ అయిన వారి పేరుతోనూ లోన్లు పొందారు. కె.ఫణికుమార్ (ఎల్ఎఫ్ఎన్ 21) అనే సభ్యుడు 2020 జనవరి 31న వీఆర్ఎస్ తీసుకున్నారు. నాటి నుంచి ఆయన సభ్యుడు కాదు. రిటైర్డ్ అయిన రెండు నెలల తర్వాత ఫణికుమార్ పేరుతో రూ.1.40లక్షల లోన్ ఎత్తారు. దాదాపు రూ.38 లక్షలు, 30 మంది విశ్రాంత ఉద్యోగులకు లోన్లు ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నాయి. టి. రాజశేఖర్ చనిపోయిన ఏడాది తర్వాత లోన్ డ్రా అయింది. పాలకవర్గం బంధువులు భార్గవ్, ఎం. రాహూల్‌రెడ్డి, చాగంటి మణికంఠ, చాగంటి ఉమామహేశ్వరరావు పేర్లతో రూ.5లక్షలకు పైగా అక్రమ పద్ధతిలో ప్రెసిడెంట్ లోన్లు ఇచ్చినట్లు రికార్డులున్నాయి. అన్నమ్మ రూ.20వేలు లోన్ తీసుకుంటే రూ.70వేలు పొందినట్లు చూపించారు. ఆమె చనిపోయాక కూడా రూ.10వేలు లోన్ ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో లోన్సొమ్మును కాజేసినట్లు ప్రెసిడెంట్ నాగమల్లుపై ఆరోపణలున్నాయి.
ఇంకా అనేక అక్రమ ఖర్చులు...
పాలకవర్గం ప్రెసిడెంట్‌గా ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ పద్ధతుల్లో ఖర్చులు చూపించి రూ.లక్షలు కాజేసినట్లు కూడా నాగమల్లుపై ఆరోపణలున్నాయి. మీటింగ్‌లు, ఎస్టాబ్లిష్మెంట్, డైరెక్టర్స్ ఇన్సెంటివ్, స్టేషనరీ, గిఫ్ట్‌లు, టీఏ, డీఏలు, లెడ్జర్ చార్జీలు, క్లర్క్ శాలరీ, జిరాక్స్, డీటీపీ చార్జీలు...ఇలా ఇష్టానుసారంగా ఖర్చులు చూపించి డబ్బులు డ్రా చేశారని ప్రెసిడెంట్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
'రూల్' తప్పిన 51 ఎంక్వైరీ...
ఈ అక్రమాలన్నింటిపై విచారణ నిర్వహించాల్సిన సహకార శాఖ ఆడిట్ అధికారులు రూల్ 51కు విరుద్ధంగా ఆడిట్ చేశారనే ఆరోపణలున్నాయి. తనిఖీ చేసిన ఆడిట్ అధికారులనే తిరిగి విచారణకు నియమించడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇతర డిపార్టుమెంట్ అధికారులను ఆడిట్‌కు పంపాల్సి ఉండగా గతంలో తనిఖీ చేసిన జ్యోత్స్న, రాంరెడ్డి, కిషోర్‌లను నియమించడంపై సహకార శాఖ నుంచి కూడా అక్రమార్కులకు సహకారం అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 17 మంది సభ్యులు ఉన్న సీ క్లాస్ సొసైటీపై విచారణ తాత్సారం అవుతుండటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అంశాలపై పాలకవర్గం ప్రెసిడెంట్ నాగమల్లును వివరణ కోరేందుకు 'నవతెలంగాణ' పలుమార్లు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
వారం పదిరోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం
విజయకుమారి, జిల్లా సహకార అధికారిణి
కలెక్టర్ గారి సూచన మేరకు విచారణ నిర్వహిస్తున్నాం. రూల్ 51 ప్రకారం ఎంక్వైరీకి ఆదేశించాం. రూల్ 51 అధికారిగా మా డిపార్టుమెంట్‌కే చెందిన జ్యోత్స్నను నియమించాం. మరో వారం పదిరోజుల్లో ఆమె విచారణ నివేదిక ఇస్తానని చెప్పారు.