Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ఇళ్ళల్లో చోరీకి యత్నం
- వరుస దొంగతనాలు... ఆందోళనలో ప్రజలు
- ఎస్ఐకి సవాల్‌గా మారిన చోరీల ఘటనలు
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన లక్ష్మీపురంలో మళ్లీ దొంగలు పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గత నెలలో జరిగిన మాదిరిగానే ఒకే గ్రామంలో నాలుగు ఇళ్ళల్లో చోరీకి ప్రయత్నించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. లక్ష్మీపురం గ్రామంలోని నుసుము కోటిరెడ్డి, సుబ్బారెడ్డి, పోతిరెడ్డి గోవిందరెడ్డి వాళ్ల ఇళ్లకి వెళ్లగా ఏమి లభ్యం కాకపోవడంతో విఫలమయ్యారు. దీంతో గోవిందరెడ్డి ఇంటి వెనుక మరో నివాసంలో వరండాలో నిద్రిస్తున్న సదాలక్ష్మీ అనే మహిళ మెడలోని నాను తాడును అపహరించాడు. అనంతరం బాదం బాలకృష్ణారెడ్డి వాళ్ల ఇంటికి వెళ్లడం గమనించిన బాధితులు కేకలు వేయడంతో పరారయినట్లు తెలిపారు. కాగా గోవిందరెడ్డి నివాసంలో ఉన్న సీసీ కెమెరాలలో నిందితుడు ముఖాచిత్రం లభ్యమయ్యాయి. సంఘటన స్థలాలను ఎసై సురేష్, క్లూస్ టీం సభ్యులు పరిశీలించారు. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీపురంలో వరుస దొంగతనాలు
30 రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు
లక్ష్మీపురం గ్రామంలో వరుస దొంగతనాలు మొదలు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత నెల ఐదో తేదీ రాత్రి ఒకే గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రెండు వైన్ దుకాణాలతో పాటు జ్యూయలరీ షాపు, సెల్ షాపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. లక్ష్మీపురం పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీపురం అభివృద్ధి చెందుతున్న గ్రామం. ఈ గ్రామంలో అనేక జ్యూయలరీ షాపులతో పాటు, వివిధ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో దొంగలు ఆయా ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల ఐదో తేదీ రాత్రి జరిగిన దొంగతనం కేసుపై ఇంకా పురోగతి లేక పోగా అదే గ్రామంలో సరిగ్గా నెల రోజుల తరువాత అదే తరహాలో దొంగతనం జరగటం తీవ్ర చర్చకు దారితీస్తుంది. దొంగలు సైతం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనబడే రీతిలో సంచరించటం బట్టి చూస్తే రిక్కీ వేసి మరి ఈ లక్ష్మీపురంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉండగా లక్ష్మీపురం గ్రామంలో గత మే నెల 5వ తేదీ రాత్రి దొంగతనం జరుగగా, మరల ఈనెల ఐదో తేదీ రాత్రి అదే తరహాలో దొంగతనం జరగడం గమనార్హం. లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతు న్నారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో బూర్గంపాడు మండలంలో గతంలో మాదిరిగా పోలీసు పెట్రోలింగ్ సరిగ్గా సాగటం లేదని విమర్శలు సైతం ఉన్నాయి.
ఎస్సైకు సవాల్‌గా మారిన చోరీల సంఘటనలు
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు నూతనంగా వచ్చిన ఎస్ఐ దారం సురేష్‌కు సవాలుగా మారింది. గత నెల ఐదో తేదీ రాత్రి ఒకే రోజు 5 షాప్‌లలో దొంగతనం జరగటంపై విచారణ చేపడుతున్న పోలీసులు ఆ కేసు ఓ కొలిక్కి రాకముందే మరల అదే గ్రామంలో... అదే తరహాలో.. దొంగలు చోరీకి పాల్పడటం పోలీసులకు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తుంది. పారిశ్రామిక ప్రాంతంపై దొంగలు దృష్టిసారించి మరి చోరీకి పాల్పడ టంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. క్లూస్ టీంతో దొంగతనం జరిగిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. అదేవిధంగా చోరీకి పాల్పడిన దొంగలు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దర్జాగా తిరగడం వారి ముఖచిత్రాలు కనబడే విధంగా ఉన్నప్పటికీ వారు దొంగతనాలు పాల్పడిన వ్యవహార శైలిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ దొంగతనాల కేసులను పోలీసులు చేధించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.