Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
- 10న మండల కేంద్రంలో ధర్నా ప్రదర్శన జయప్రదం చేయండి
- సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ-చర్ల
మండలంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 7 వేల ఎకరాల భూమి కోల్పోయి 22 గ్రామాలకు చెందిన 2500 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారని, వీరందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మచారి సోమవారం డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలో 4768 కుటుంబాలు సాగు చేసుకుంటున్న 17896 ఎకరాల భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్‌తో పాటు మండలంలో అర్హులైన దళితులు అందరికీ దళిత బంధు వర్తింపజేయాలని, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పక్రియను గ్రామసభల ద్వారా ఎంపికచేయాలన్నారు. మండలంలో పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ,,సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.3 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 10వ తేదీ శుక్రవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మండల కమిటీ తెలిపింది. సీపీఐ(ఎం) మండల కార్యాలయం బిఎస్ రామయ్య భవన్లో జరిగిన సమావేశంలో ధర్నాకి సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చర్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించాలన్నారు. మండల కేంద్రంలో రైతు బజారు ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డబ్బులు చెల్లించాలని, అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ, పైప్‌లైన్ వేసి ఇంటింటికీి తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్వాసితులను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. మండలంలో గోగు బాకా, కలివేరు, వీరాపురం తదితర గ్రామాలలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగానే ఉన్నాయని వాటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కోటి ముత్యాలరావు మచ్చారామారావు, పి.సమ్మక్క, బోళ్ళవినోద్, శ్యామల వెంకటేశ్వర్లు, బందెల చంటి తదితరులు పాల్గొన్నారు.