Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా
నవతెలంగాణ- సత్తుపల్లి
బడులు తెరిచే నాటికి ప్రతి బడికి పాఠ్య పుస్తకాలు, దుస్తులు చేరాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సత్తుపల్లి వచ్చిన రవి స్థానిక ఆ సంఘ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా మనఊరు- మనబడి కార్యక్రమాన్ని తీసుకుని ఆంగ్ల మాధ్యమాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అమలు పర్చేందుకు నిర్ణంచిందన్నారు. కానీ నేటి వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందించలేక పోయిందన్నారు. బడులు తెరిచే నాటికే అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటుగా పిల్లలకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు, దుస్తులు, పంపిణీ జరిగేలా చూడాలన్నారు. పాఠశాలలకు స్కావేంజర్లను తక్షణమే నియమించాలన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలన్నారు. తక్షణమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు లేకపోవడం శోచనీయమన్నారు. వేసవి సెలవుల్లోనే ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టాలన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జీఎస్ఆర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జల్లిపల్లి మురళీమోహన్, సత్తుపల్లి మండల అధ్యక్షుడు బాల నాగేశ్వరరావు, పూర్వ జిల్లా కార్యదర్శులు కళ్యాణం నాగేశ్వరరావు, చెరుకు శ్రీనివాసరావు, కొచ్చెర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.