Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీలను డబ్బులు కోసం వేదిస్తున్న మీడియాపై చర్యలు తీసుకోవాలని మంగళవారం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహాసీల్దార్ రంగా ప్రసాద్‌కు ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేసారు. ఈ సందర్బంగా బాధితులతో కలసి ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ దమ్మపేట మండలంలో కొంత మంది మీడియా పేరుతో దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి వ్యవసాయ పనికి తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని వాపోయారు. వీరి ఆగడాలపై దైర్యం చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు తమ గోడును వినిపించుకోకుండా సదురు విలేకర్ల పక్షానే మాట్లాడుతూ ఫిర్యాదుదారులపై దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తమ సమస్యపై ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన తహాసీల్దార్‌కు విన్నవించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని వినతి పత్రం అందచేసామన్నారు. గత నెల 7వ తేదీన అప్పారావుపేటలో ఆదివాసీ గిరిజనుడు తన భూమిని చదును చేసుకుంటూ వచ్చిన మట్టిని తన సొంత ఇంటికి తోలుకుండగా విలేకరినని ఒక వ్యక్తి వచ్చి కులం పేరుతో దూషించి, బూతులు తిడుతూ దాడికి దిగాడన్నారు. దీనిపై 8వ తేదీన దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే సదురు వ్యక్తులు ఈనెల 2వ తేదీన గంగులగూడెం గ్రామంలో బోరు కడిగించుకుంటున్న ఆదివాసీ గిరిజనులను బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేసి వారి దగ్గరున్న రూ.15 వేలు తీసుకెళ్లి మరుసటి రోజు మిగిలిన 15 వేలు ఇవ్వాలని వేదిస్తున్న తరుణంలో 4వ తేదీన ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోగా పోలీసులు తమనే తిడుతూ మీ వెనక ఎవరున్నారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి దందాలు మండలంలో నిత్యం అనేకం వీరు చేస్తున్నా అమాయకులైన ఎస్సీ, ఎస్టీలు దైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. దైర్యం చేసి ముందుకు వచ్చిన వారికి అండగా నిలవాల్సిన అధికారులు దందా దారుల పక్షానే నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మీడియా ప్రతి నిధులే ఇటీవల మొద్దులగూడెంలో పొలాలకు చెరువు ఒండ్రు తోలుతున్న ట్రాక్టర్లను అడ్డగించి రూ.30 వేలు వసూళ్లు చేసారని, సదురు బాధితులు అధికారులు సహకరించడం లేదని బావించి ఫిర్యాదు చేయకుండానే వారికి డబ్బులు ముట్టచెప్పి మిన్నకుండి పోయారని తెలిపారు.
వీరి ఆగడాలతో రైతుల పనులకు జేసీబీ, ట్రాక్టర్లు అద్దెకు రావడం లేదని అన్నారు. విలేకర్లకు ప్రత్యేకమైన హక్కులు, అధికారాలేమైనా వుంటే స్పష్టం చేయాలని తహాసీల్దార్‌ను కోరారు. వీరి అనుమతులతో వ్యవసాయం చేసుకోలేమని అన్నారు. దీనిపై తహాసీల్దార్ మాట్లాడుతూ మట్టిని తోలుకోవాలన్నా, బోరు బావులు తవ్వుకోవాల న్నా అనుమతులు తప్పని సరి అని అన్నారు. వినతి పత్రంపై విచారణ జరుపుతామన్నారు.