Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిలో మండలం ముందంజ
- 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్, జడ్పీ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పల్లె ప్రగతితోనే గ్రామాలకు మౌళిక సదుపాయాలతో పాటు స్వచ్ఛ గ్రామాలుగా పల్లెలు రూపు దిద్దుకుంటున్నాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 5వ రోజు మంగళవారం వారు చిన్నబండిరేవు, పెద్దనల్లబల్లి గ్రామ పంచాయతీలలో పలు అభివృద్ధి పనులతో పాటు పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. ముందుగా చిన్నబండిరేవు గ్రామంలో ఆర్అండ్బి రోడ్డు నుండి గొట్టుముక్కల వెంకన్నరాజు ఇంటి వరకు జిల్లా పరిషత్ నిధులతో సుమారు రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి పనులను వారు ప్రారంభించారు. అనంతరం గడ్డోరిగట్ట గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి శైలజా రెడ్డి ప్రత్యేక చొరవతో కోరె గడ్డితో ఏర్పాటు చేసిన గుడిసెను చూసి కలెక్టర్ అభినందించడంతో పాటు ప్రతి పల్లె ప్రకృతి వనంలో కోరె గడ్డితో గుడెసెలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా దళిత వాడకు చెందిన మహిళలు గ్రామానికి మిషన్ భగీరధ నీరు రావడం లేదని, అంగన్వాడీ నూతన భవనం నిర్మించి ఇవ్వాలని, సీసీ రహదారి తదితర విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకు పోయారు. దీంతో స్పందించిన ఆయన దళిత వాడకు సిసి రహదారి, అంగన్వాడీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయడంతో పాటు డబుల్ ఇళ్ల వద్ద ట్యాంకు ఏర్పాటు చేసి మిషన్ భగీరధ ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారు పెద్దనల్లబల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశంలో వారు పాల్గొన్నారు. ముందుగా వారు తాలిపేరు గట్టు తో పాటు ఆర్ అండ్ బి రోడ్డు నుండి డంపింగ్ షెడ్‌కు వెళ్లే రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి, మట్లాడారు.
పెద్దనల్లబల్లి సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకు పోయారు. డిఆర్డిఓ మధుసూదరాజు, ఎంపిపి రేసు లకీë, జడ్పీటీసి సభ్యురాలు తెల్లం సీతమ్మ, మండల ప్రత్యేక అధికారి ఎం. చంద్రప్రకాష్, తహశీల్దార్ కె. చంద్రశేఖర్, ఎంపిడిఓ ఎం.చంద్రమౌళి, ఎంపిఓ ముత్యాలరావు, ఐటిడిఏ డీఈ హరీష్, ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు, కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు, మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణమూర్తి తదితరులు ఉన్నారు.