Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 150 ఇళ్లల్లో తనిఖీలు, 30 వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని పలు కాలనీల్లో పోలీసులు మంగళవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా సోదాలు, తనిఖీలు నిర్వహించారు. పెద్దఎత్తున పోలీసులు కాలనీల్లోకి చేరుకోవడంతో ఏమి జరుగు తుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురైయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఆ తర్వాత పోలీసులు పేర్కొన్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ సూచనల మేరకు భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ ఏరియాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 ఇండ్లు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలు చలాన్లు చెల్లించని, నంబర్ ప్లేట్లు లేనివాటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరి వద్ద నుండి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు, సైబర్ క్రైమ్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు ఈసందర్భంగా వివరించారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు మిగతా కానిస్టేబుల్లతో కలుపుకొని మొత్తం 50 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సి.ఐ. నాగరాజురెడ్డి, ఎస్.ఐ.లు మధు ప్రసాద్, శివ రామకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.