Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం
నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం భద్రాచలంలో గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి ఆర్గనైజర్లు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే లైను నిర్మాణాన్ని బీజేపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలంకు పొంచి ఉన్న ప్రమాదంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని నీటి వనరులను సద్వినియోగం చేసే పద్ధతిలో చెరువులు, చెక్ డ్యాములు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పోడు, సాగుదారులకు పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆయన విమర్శించారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇతర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలం అయిందని ఆయన ఆరోపించారు. భద్రాచలం నియోజ కవర్గ అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని పాలకుల ముందు ఉంచే పద్ధతులు రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య, సున్నం గంగా, చర్ల మండల పార్టీ నాయకులు మచ్చ రామారావు, శ్యామల వెంకటేశ్వర్లు, సమ్మక్క, నరేష్ పట్టణ నాయకులు నాగరాజు, భూపేంద్రలు పాల్గొన్నారు.