Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్ఫెయిర్లో జిల్లా జడ్జి డా|| శ్రీనివాసరావు సూచన
- జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో పుస్తక ప్రదర్శన కీలకం
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
సెల్ఫోన్లకు దూరంగా...పుస్తకాలకు దగ్గరగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం పుస్తక మహౌత్సవం ఆరోరోజైన మంగళవారం తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్జి ముఖ్యోపన్యాసం చేశారు. తన జీవితానుభవాల్లో పుస్తకాల ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రతి ఒక్కరికీ జ్ఞానం అవసరం అన్నారు. పుస్తకాలతోనే జ్ఞాన సముపార్జన సాధ్యమన్నారు. జ్ఞానం ప్రతి వ్యక్తికీ కిరీటం లాంటిదని అభివర్ణించారు. పుస్తక ప్రియుడు, దార్శనికుడైన సీఎం కేసీఆర్ అండదండలతో పుస్తక మహౌత్సవాన్ని రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నట్లు బుక్‌ఫెయిర్ నిర్వాహకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. మహా నగరాల నుంచి పల్లెపల్లెకూ పుస్తక ప్రదర్శనను తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో పుస్తక ప్రదర్శనలను కీలకాంశంగా గుర్తించామన్నారు. ఖమ్మానికి పుస్తక ప్రదర్శనలు కొత్తకాదని, గతంలో కవి యాకూబ్ ఆధ్వర్యంలో రొట్టెమాకు రేవు లాంటి మారుమూల పల్లెలోనూ పుస్తక ప్రదర్శన నిర్వహించామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒక్క కార్డు ముక్కతో పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారని తెలిపారు. ఆయనకు పుస్తకాలపై ఉన్న అభిరుచికి ఇది నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎండీ జావిద్‌పాషా, వాగ్గేయకారుడు జయరాజు, రచయిత శేషగిరి, వెంకటయ్య, విద్యావేత్త ఐవీ రమణారావు, పుస్తక ప్రదర్శన కార్యదర్శి కోయ చంద్రమోహన్, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త అట్లూరి వెంకటరమణ, ప్రముఖ కార్డియాలజిస్టు, రచయిత ఎంఎఫ్ గోపినాథ్, నిర్వాహకులు సీతారాం, ప్రసేన్, రవిమారుత్, క్రాంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.