Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన
- ఇప్పటికే రెండుసార్లు టూర్ వాయిదా...
- మూడోసారైనా ముడిపడేనా? అంటూ సందేహాలు
- జోడు ఎంపీ పదవులతో టీఆర్ఎస్ రాజకీయ ముఖచిత్రంలో మార్పులు
- ఎవరు కలిసి వస్తారో... ఎవరు దూరంగా ఉంటారోనని చర్చ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
అధికార టీఆర్ఎస్కు ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు ఎప్పుడూ రుచించని పరిస్థితే నెలకొంది. ఉమ్మడి జిల్లాపై పట్టుకోసం ఆ పార్టీ పడరాని పాట్లు పడుతూనే ఉంది. ఎవర్ని దగ్గరకు తీయాలో...? ఎవర్ని దూరం పెట్టాలో తెలియని అయోమయ స్థితి ఆ పార్టీ అధిష్టానానికి అంతుపట్టని సమస్యగా మారింది. ఈ అనిశ్చితి నుంచి బయటపడేందుకు గులాబీ పెద్దలు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనతో పార్టీని ఏకతాటిపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు గట్టి తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఏప్రిల్ నుంచి ఖమ్మం పర్యటనకు షెడ్యూల్ విడుదల చేస్తూనే ఉన్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ టూర్ వాయిదా పడింది. తిరిగి ముచ్చటగా మూడోసారి 'పల్లె, పట్టణ ప్రగతి' కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 11వ తేదీన కేటీఆర్ పర్యటనను ఖాయం చేశారు. ఈసారి కూడా సారొస్తారనే కచ్చితమైన నిర్ధారణకు ఆ పార్టీ శ్రేణులు రాలేకపోతున్నాయి. జోడు ఎంపీ పదవులతో అధికార టీఆర్ఎస్ రాజకీయ ముఖచిత్రం మారిన నేపథ్యంలో కేటీఆర్ పర్యటన విస్తృత చర్చకు దారితీస్తోంది.
గుబులు గుబులుగా 'గులాబీ'
ఖమ్మం జిల్లా 'గులాబీ' పార్టీలో పవర్ సెంటర్లు పెరుగుతున్నాయని, ఒకరికి పదవి వస్తే మరొకరు జీర్ణించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఏప్రిల్ 16వ తేదీన కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. దీనికి రెండు రోజుల ముందు షెడ్యూల్ విడుదల చేశారు. దీనిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లంచ్ ఫిక్స్ చేశారు. కానీ పార్టీలో కొందరు కీలక నేతలకు ఇది రుచించలేదని అప్పట్లో ప్రచారం సాగింది. దీనికి బీజేపికి చెందిన సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతం కూడా తోడైంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు వాయిదా పడిన ఆ పర్యటన తిరిగి 18వ తేదీన ఖాయం చేశారు. 16వ తేదీ నాటి షెడ్యూల్‌ను యథావిధిగా విడుదల చేశారు. ఇదే సమయంలో పార్లమెంటరీ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉండటంతో మరోమారు కేటీఆర్ టూర్ వాయిదా పడింది. తిరిగి 24వ తేదీన పర్యటన ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరిగినా అదీ కూడా ఉత్తిదే అయింది. ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారిథిరెడ్డి, జిల్లాతో ఎనలేని బంధం ఉన్న వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లు రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ అయ్యారు. ఈ పరిణామం ఆ పార్టీలో కొందరు కీలక నేతలను కలిచివేసినట్లు తెలుస్తోంది. పైకి లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నా...లోలోన మదనపడుతున్నారనే చర్చ సాగుతోంది.
కేటీఆర్ పర్యటనకు ఎవరు దూరం...
ఎవరు దగ్గర...
జోడు ఎంపీ పదవుల్లో ఒకటి దాదాపు పొంగులేటికి ఖాయమైందనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా సాగింది. కానీ అనూహ్యంగా పార్థసారథి, వద్దిరాజులకు ఆ పదవులు దక్కాయి. పొంగులేటి తిరస్కరించడంతోనే ఈ పదువులు వారికి దక్కాయనే ప్రచారం ఉంది. కానీ పొంగులేటి ఈ పదువుల విషయంలో ఏమాత్రం స్పందించకుండా ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రవిచంద్ర, మంత్రి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో ఎంపీ పదవి గాయత్రి రవిని వరించింది. రాజ్యసభ సభ్యులుగా ప్రకటించిన వెంటనే గాయత్రిని అభినందించిన మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆ తర్వాత నుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఇటు గాయత్రి రవి, అటు పార్థసారథిరెడ్డిలను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక మంగళవారం రాత్రి కేటీఆర్‌ను సైతం ఆయన కలిశారు. ఇదిలావుండగా పదవి అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చేందుకు సన్నద్ధమైన పార్థసారథి, వద్దిరాజులు తమ పర్యటనను వాయిదా వేస్తూ వస్తున్నారు. 11వ తేదీ కేటీఆర్ పర్యటన ఒకవేళ ఖాయమైనా రవిచంద్ర అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. ఆయన ఆరోజున తిరుపతిలో ఉంటారని సమాచారం.
ఇక పార్థసారథి విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. వివిధ దేశాల్లో వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా ఆయన ఎప్పుడు వస్తారని పార్టీ శ్రేణులు నిర్ధిష్టంగా చెప్పలేక పోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గతంకంటే కూడా మరింత అంతర్మథనం చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని విమర్శకుల మాట.