Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు డైరెక్టర్లు ఏకగ్రీవం
- పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువు గిరిజన మత్స్యకార సహకార సంఘ ఎన్నికలు గంగారం దాసరి వీరారెడ్డి హైస్కూల్లో గురువారం ఉత్కంఠ భరితంగా పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరిగాయి. 310 మంది సభ్యులున్న ఈ సహకార సంఘంలో రెండు వర్గాలు పోటీపడ్డాయి. గంగారం గ్రామానికి చెందిన వర్గ సభ్యులు ఈ ఎన్నికల్లో గెలుపొందగా కాకర్లపల్లి, రామానగరానికి చెందిన వర్గం ఓటమిపాలయింది. ఈ సొసైటీ పరిధిలో 9 మంది డైరెక్టర్లు ఉండగా ఇద్దరు డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యారు. మరో 7 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా 15 మంది సభ్యులు పోటీలో నిలిచారు. వారిలో మహిళల కేటగిరీ నుంచి సాలి వజ్రమ్మ, కొర్సా మహాలక్ష్మీలు ఏకగ్రీవం కాగా ఎన్నికలు నిర్వహించిన డైరెక్టరు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన కొండా జయరాజు, జనరల్ కేటగిరీ నుంచి పొదిల మారేశ్వరరావు, పొదిల శ్రీనివాసరావు, ఊకే కన్నారావు, కాకా రామచంద్రరావు, బొందల రాంబాబు, నీలాల నరసింహారావులు గెలుపొందారు. గెలుపొందిన డైరెక్టర్లకు మత్స్యశాఖ అధికారులు ధృవపత్రాలు అందించారు. ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎడీవీ రఘురామిరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ప్రిసైడింగ్ అధికారిగా కిశోర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా జగదీశ్, పోలింగ్ అధికారిగా అఖిలాబేగం వ్యవహరిస్తూ ఎన్నికలను నిర్వహిం చారు. 310 ఓటర్లకు గాను 279 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 26 ఓట్లు చెల్లనివిగా పరిగణించారు.
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు...
రెండు వర్గాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో సత్తుపల్లి పోలీసులు సీఐ కరుణాకర్ పర్యవేక్షణలో ఎస్సైలు షాకీర్ (సత్తుపలి)్ల, సురేశ్ (వేంసూరు) ఆధ్వర్యంలో 25 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగిన హైస్కూలు వద్ద నిర్వహించిన బందోబస్తు విజయవంతమైంది. గత 30 ఏండ్లకు పైగా ఎన్నికలు జరక్కుండా నడుస్తున్న ఈ సొసైటీలో రెండు వర్గాల మధ్య గత మూడేండ్లుగా వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో అప్పటి నుంచి చెరువులో చేపల వేట నిలిచిపోయింది. దీంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో మత్స్యశాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించారు.