Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్షణ్ రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ప్రకారం సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పన పూర్తి చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణారావు తెలిపారు. గురువారం ప్రిన్సిపాల్ చాంబర్లో వైద్య కళాశాలలో సౌకర్యాలు కల్పన, ఫ్యాకల్టీ అంశాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 31వ తేదీన వైద్య కళాశాల ఏర్పాటుకు జాతీయ మెడికల్ కౌన్సిల్ తనిఖీ చేసిన సమయంలో గుర్తించిన అంశాలపై ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ తనిఖీలో గుర్తించిన లాప్స్ ప్రకారం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ నియమాలు ప్రకారం వైద్య కళాశాల ఏర్పాటుకు 300 పడకలు సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 100 పడకలు, కొత్తగూడెం భోదనా ఆసుపత్రిలో 240 పడకలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 54 మంది ఫ్యాకల్టీ సిబ్బంది వైద్య సేవలు నిర్వహణకు ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో విధులు నిర్వహణకు అవసరమైన 32 మంది సపోర్టింగ్ సిబ్బంది నియామకపు ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. భోదనా ఆసుపత్రిలో సౌకర్యాలతో వార్డులు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి వైద్య సేవలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు.
అపోహలు..
జాతీయ మెడికల్ కౌన్సిల్ వైద్య కళాశాల రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని కొట్టిపారేశారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ తిరిగి తనిఖీ చేసేందుకు వస్తారని ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినందున తప్పకుండా మన జిల్లాకు వైద్య కళాశాల మంజూరవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్యులు సురేంద్ర, నరసింహారావు, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.