Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ ఇండ్లు తమకే కేటాయించాలంటూ స్థానిక పేదల ఆందోళన
- జాతీయ రహదారిపై నిరసన
నవతెలంగాణ-చండ్రుగొండ
పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదే పేదల మధ్య గొడవకు కారణమైంది. తమ గ్రామంలో నిర్మాణాలు చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో వేరొక గ్రామం నుంచి ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ప్రారంభోత్సవానికి ముందే వచ్చి నివాసం ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక పేదలు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన బాట పట్టారు. ఇదే విషయంపై తిప్పనపల్లి గ్రామానికి చెందిన మరికొంత మంది డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వద్దకు చేరుకున్నారు. పక్కనే ఆనుకుని ఉన్న తిప్పనపల్లి గ్రామానికి చెందిన తమకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ పట్టుబట్టారు. దాంతో పేద ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లయింది.
ఇక అసలు విషయానికొస్తే చండ్రుగొండ గ్రామ పంచాయతీకి చెందిన 40డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేసుకొని మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న అధికారులు స్థానిక పంచాయుతీలో ఉన్న అన్ని కులాలకు చెందిన ఎంతో మంది పేద ప్రజలు నిలువనీడ లేని వారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 15మంది లబ్ధిదారులు మాత్రమే ఎంపిక చేశారు. మిగతా వారిని పక్క గ్రామాల నుంచి ఎంపిక చేశారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలు తమ గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వేరొక గ్రామం నుంచి ఎలా వస్తారంటూ తమకు కూడా ఎలాంటి ఆధారం లేక పోవడంతో తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకు వివిధ పార్టీలు కూడా మద్దతు తెలిపినప్పటికీ అధికారులు మాత్రం పేదల ఆవేదనను పక్కనబెట్టి తమకున్న ఆదేశాల ప్రకారం వారి పని వారు కానిచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆనుకుని ఉన్న తిప్పనపల్లి గ్రామాన్ని సైతం వదిలేసి ఎక్కడో ఉన్న బెండాలపాడు గ్రామానికి చెందిన వారిని ఎంపిక చెయ్యడం గురువారం జరిగిన సంఘటనకు కారణమైంది. ఈ విషయమై పేద ప్రజలంతా కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేశారు. దాంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రవికుమార్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకు న్నారు. ఆందోళనకు దిగిన వారిని సర్దిచెప్పేందుకు ప్రయ త్నించారు. ససేమిరా వారు వినకపోవడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తామని సర్దిచెప్పడంతో కథ సుఖాంతమైంది. ఏది ఏమైనా పేదల నోటికాడి కూడు లాక్కున్న చందంగా ప్రభుత్వం పని తీరు ఉందని పలువురు విమర్శిస్తున్నారు.