Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్రికా కథనాలకు, ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని వైనం
- కలెక్టర్ సాబ్ మీరైనా దృష్టి సారించండి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మించే సీతమ్మ సాగర్ బహుళార్దక సాధక హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా గత నాలుగు నెలలుగా లెప్ట్ బ్యాంకు కరకట్ట నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారు కరకట్ట నిర్మాణ పనులకోసం గత నాలుగు నెలలుగా ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్‌కు వెళ్లే రహదారి గుండా మట్టి, ఇసుక, పెద్ద మెటల్ వంటి తోలకాలను భారీ వాహనాలతో సాగిస్తున్నారు. సుమారు 40 నుండి 45 టన్నుల అధిక లోడుతో నిబందనలకు విరుద్దంగా మట్టి రోడ్డుపై తోలకాలు సాగించడం వలన చిన్నబండిరేవు నుండి ప్రగళ్లపల్లి వరకు గల సుమారు 3 కి.మీ రహదారి గోతుల మయంగా తయారు కావడంతో పాటు పూర్తిగా శిధిలమై పోయిందనే చెప్పవచ్చు. సూరవరం దగ్గర ఉన్న చఫ్టా మొత్తం కుంగి పోవడంతో గుత్తేదారు చఫ్టా పై గ్రావెల్ పోసి రాక పోకలు సాగిస్తున్నారు. దీని వలన చప్టా మొత్తం పూడి పోయి వర్షాకాలంలో వరద నీరు రహదారి పై నుండి పారే ప్రమాదం ఉంది. దీంతో పాటు గత ఎనిమిది నెలల క్రితం ఇదే రహదారికి .జిల్లా పరిషత్ నిధుల నుండి రూ.5 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించారు. నిత్యం భారీ వాహనాలు రాక పోకలు సాగించడం వలన గ్రావెల్ రహదారి కాస్త మట్టి రహదారిగా మారి గోతుల మయంగా తయారైందనే చెప్పవచ్చు.
భారీ వాహనాలతో శిధిలమైన రహదారి : సీతమ్మ సాగర్ లెప్ట్ బ్యాంకు కరకట్ట నిర్మాణ పనుల పేరుతో గత నాలుగు నెలలు గా భారీ వాహనాలు రేయింభవళ్లు అధిక లోడుతో రాక పోకలు సాగించడం వలన చిన్నబండిరేవు నుండి లిప్పు ఇరిగేషన్ వైపు వేళ్లే జిల్లా పరిషత్ రహదారి మొత్తం శిధిలమై గోతుల మయంగా తయారైంది. ఈ రహదారి గుండానే నిత్యం రైతులు రాత్రి పగలు పంట పొలాలకు రాక పోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి వర్షాకాలం వచ్చిందంటే చాలు మోకాళ్ల లోతు బురమయంగా తయారై రైతులు ఆ రహదారి గుండా నడవాలంటే నరకయాతన అనుభవిస్తుంటారు. భారీ వాహనాలు నిత్యం ఈ రహదారి గుండా రాక పోకలు పాగించడం వలన ఈ ఏడాది రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే కష్ట సాద్యం అనే చెప్పవచ్చు. వాహన రాక పోకలతో శిధిలమవుతున్న రహదారి గురించి అనేక మార్లు పత్రికల్లో (నవతెలంగాణ)లో కధనాలు ప్రచురించినప్పటికి, ప్రజలు, రైతులు గగ్గోలు పెడుతున్నప్పటికి కరకట్ట పనులు చేపడుతున్న గుత్తే దారుకు కాని ప్రభుత్వ అధికారులకు గాని చీమకుట్టినట్లుకూడా లేదనే చెప్పవచ్చు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన చిన్నబండిరేవు నుండి లిప్టు ఇరిగేషన్ వెళ్లే రహదారి శిధిలం పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఈ ప్రాంత రైతులు పంట పొలాలకు రాక పోకలు సాగించే విదంగా బిటి రహదారి ఏర్పాటు ప్రజలు వేడుకుంటున్నారు.
దుమ్ముదూళితో ఇండ్లలో ఉండలేక పోతున్నాం :
బోడ ఉప్పలమ్మ (గృహిణి),చిన్నబండిరేవు గ్రామం
గత నాలుగు నెలలుగా లారీలు చిన్నబండిరేవు ప్రదాన రహదారి నుండి ప్రగళ్లపల్లి వరకు టిప్పర్లతో ఇసుక వంటి తోలకాలు సాగించడం వలన దుమ్ముధూళి ఇళ్ల పైకి రావడం వలన ఇళ్లల్లో ఉండలేక పోతున్నాం. ఈ విషయమై అనేక మార్లు లారీ యజమానుల దృష్టికి తీసుకు పోయినప్పటికీ పట్టించుకునే వారే లేరు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఈ ఏడాది పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులే : రైతు తంత్రపల్లి సాగర్
సీతమ్మ సాగర్ కరకట్ట పేరుతో గత నాలుగు నెలలు భారీ టిప్పర్లు ఇసుకు తోలకాలు సాగించడం వలన చిన్నబండిరేవు నుండి ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్‌కు వెళ్లే దారి పూర్తి గోతులమయంగా తయారైంది. దీని వలన వర్షాకాలంలో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. నిబందనలకు విరుద్దంగా తోలకాలు సాగిస్తున్న లారీ యజమానుల పై కేసులు నమోదు చేయాలి.
గుంతలు పడ్డ ప్రాంతాలను పూడ్చి మరమ్మతులు చేస్తాం : ఎల్‌అండ్‌టి ఇంజనీర్ దినేష్
ఈ విషయమై నవతెలంగాణ ఎల్అండ్టీ ఇంజనీర్ దినేష్‌ని వివరణ కోరగా భారీ వాహనాలు తిరగడం వలన రహదారి గుంతల మయంగా మారిన మాట వాస్తవమేనని...గుంతలు పడ్డ ప్రాంతాలను గ్రావెల్‌తో పూడ్చి వేస్తూ మరమ్మతులు చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఈ రహదారి బిటి రహదారిగా మారే అవకాశం ఉందన్నారు.