Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-వైరా టౌన్
అరకోరగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఖరీఫ్ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను సవరించి వరి ధ్యానం, మొక్కజొన్న క్వింటాకు మూడు వేల రూపాయలు, పత్తి పంట క్వింటాకు పది వేల రూపాయలు కనీస మద్దతు ధర (ఎంఎస్ఫీ) నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం వైరా కృషి విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అరకోరగా కనీస మద్దతు ధరలను పెంచి రైతుల కష్టాలను పట్టించుకొవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి పంట సాగును దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని, అందుకే వాస్తవ సాగు ఖర్చులు పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం క్వింటా100 రూపాయలు నామ మాత్రంగా పెంపుదల చేసిందని అన్నారు. బహిరంగ మార్కెట్ లో పత్తి క్వింటాకు 14 వేల రూపాయలు పైగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అందులో సగం ధర కూడా మద్దతు ధరగా ప్రకటించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర జాబితాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు కందులు, పెసలు, మినుములు, పోద్దుతిరుగుడు లాంటి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం సేకరణ చేసే ధాన్యం, మొక్కజొన్న, పత్తి ధరలు మాత్రం స్వల్పంగా పెంచి రైతులను మోసం చేసిందని అన్నారు. గత వ్యవసాయ సీజన్ నుంచి నేటివరకు ఎరువులు, పురుగు మందులు, డీజిల్, రవాణా, కూలీలు ఖర్చులు 30 శాతం పెరిగాయని పెరిగిన ఖర్చులు, వాతావరణం మార్పుల వలన వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయిందని, పెరిగిన ఖర్చులు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధర నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న క్వింటాకు మూడు వేలు, పత్తి క్వింటాకు పది వేలు, చెరుకు టన్నుకు నాలుగు వేలు రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, కౌలు రైతు సంఘం నాయకులు యనమద్ధి రామకష్ణ, రైతు సంఘం సినీయర్ నాయకులు వాసిరెడ్డి విద్యా సాగర్ రావు, బెజవాడ వీరభద్రం, కురగుంట్ల శ్రీనివాస్ రావు, నారికొండ అమరేందర్, ఎస్.డి పాషా, పల్లెబోయిన కృష్ణ, మాడపాటి వెంకట్, వడ్లమూడి మధు, సంక్రాంతి సతీష్, రాందాసు తదితరులు పాల్గొన్నారు.