Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షులు 'నయనాల'
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని నిరంతరం అధ్యయనం చేయాలని, మూల్ నివాసి సంగ్ జాతీయ అధ్యక్షులు నయనాల కృష్ణారావు అన్నారు. దేశవ్యాప్త మహాజన జాగరణ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం రాజ్యాంగాన్ని చదివితే భారతీయ సంవిధానం, సగౌరవం, సంరక్షణ, సంవర్ధన అనే విషయాలు అవగతమవుతాయని తెలిపారు. భారత రాజ్యాంగం ఎవరిదో కాదని, భారతీయ ప్రతి పౌరునిది అని ఆయన తెలిపారు. వేల సంవత్సరాల నుండి, ఆంగ్లేయుల పాలన వరకు సామాజిక, మతపరమైన వ్యవస్థలో బహుజనులకు తీరని అన్యాయం జరిగిందని, దాన్ని తీర్చేందుకే బాబాసాహెబ్ రాజ్యాంగం మనకు అందించారన్నారు. భారత రాజ్యాంగం మనకు ఏమి ఇచ్చిందో పీఠిక చదివితే స్పష్టంగా అర్థమవుతుందని ఆయన వెల్లడించారు. దీనిలో 22 భాగాలు, 12 పట్టికలు, 395 అధికరణలు, 5 అనుబంధాలతో రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా అవతరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బామ్ సెఫ్ జిల్లా క్యాడర్ బరగడి దేవదానం, కమలారాణి, దయానంద సాగర్, రాజశేఖర్, మందపల్లి అరుణ్ బాబు, డాక్టర్ కృష్ణయ్య, సురేష్, ముస్తఫా, ప్రసాద్, సుగుణ రావు, వెంకటయ్య కృష్ణా రావు, తొగరు రాజశేఖర్ పాల్గొన్నారు.