Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ములకలపల్లి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులను కోరారు. శుక్రవారం ములకలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌లతో కలసి దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్, 2 ఆటోలను ముగ్గురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం శివారులో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం (మెగా పార్క్)లో వారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారాంపురం పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా సంవత్సర కాలంలోనే అడవిని మైమరపించే రీతిన మొక్కలు పెంచడాన్ని మండల అధికారులను, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బందిని ఆయన అభినందించారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఇచ్చే బడ్జెట్ సీతారాంపురం గ్రామపంచాయతీ కూడా వస్తుందని, కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ మొక్కలు బాగా పెంచారని ఈ విషయంలో ఫారెస్ట్, రెవెన్యూ, మండల పరిషత్ శాఖల అధికారులు సమన్వయంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల శ్రద్ధ బాగా ఉందని ఆయన వారిని అభినందించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆరోగ్యం రాదని, మొక్కల పెంపకంతో పచ్చదనం, పరిశుభ్రత బాగా ఉంటే గ్రామాలు, పట్టణాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జిల్లాలోనే అశ్వరావుపేట నియోజకవర్గాన్ని హరిత హారంలో మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం అధికారులు శ్రమించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, ఎంపీడీవో సిహెచ్ నాగేశ్వరరావు, తహసీల్దార్ వీరభద్రం, సర్పంచులు భద్రం, సుశీల, ఏపీఓ విజయలక్ష్మి, ఎంపీఓ లక్ష్మయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బ్యాంకు అధికారులపై కలెక్టర్‌కు ఎంపీటీసీ విజయ ఫిర్యాదు
మండల కేంద్రంలోని ములకలపల్లి పంచాయతీ కార్యక్రమంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌కు పలు బ్యాంకులపై పాత గంగారం ఎంపీటీసీ మడకం విజయ పిర్యాదు చేసారు. వ్యవసాయ రుణాలు మాఫీ అవ్వలేదని, పేదల బ్యాంకు ఖాతాలను నిలిపివేసి వేధిస్తున్నారని, పేద ప్రజలు పొట్ట కూటి కోసం చేసిన ఉపాధి హామీపని, తునికాకు బోనస్, ఆసరా పింఛన్, రైతు బంధు డబ్బులు తీసుకోకుండా బ్యాంకు ఖాతాలు నిలిపివేసి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వివరించారు. పేద ప్రజలను వేదిస్తున్న బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరారు.