Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మంత్రి కేటీఆర్ నగర పర్యటన
- ప్రారంభించిన పనులనే మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు
- జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయం
- ఫ్లెక్సీల్లోనూ కనిపించిన వర్గ విభేదాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటిస్తారు. కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని నగరాన్ని గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలతో నింపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పర్యటనను భావించారు. తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన షెడ్యూల్లో చోటు చేసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు. వాటినే మళ్లీ కేటీఆర్‌తో ఆవిష్కరించేందుకు సిద్ధం చేశారు. ఇక కేటీఆర్ నగర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలోని వర్గవిభేదాలకు అద్దంపడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొన్ని ప్రారంభం...మరికొన్ని పున:ప్రారంభం
వాస్తవానికి మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 16, 18 తేదీల్లో నగరంలో పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అనేక అభివృద్ధి పనులను మంత్రి అజరు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వాటిలో కొన్నింటిని మంత్రి కేటీఆర్ పున:ప్రారంభించనున్నారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా తొలుత ఉదయం 9.15 గంటలకు లకారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభిస్తారు. ఇప్పటికే వీటిని ప్రారంభించి, రుసుం సైతం వసూలు చేస్తున్నారు. సందర్శకుల రాకపోకలు కొనసాగుతున్నాయి. 9.45 గంటలకు సుడా పార్క్, రఘునాథపాలెం మండలకేంద్రంలోని పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు. 10.15 గంటలకు 240 డబుల్ బెడ్రూం ఇళ్లు, తెలంగాణ క్రీడా ప్రారంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు. 10.45 గంటలకు సర్దార్‌పటేల్ స్టేడియంలో పట్టణ ప్రగతిపై బహిరంగసభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నగర పాలక సంస్థ ఓల్డ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన నూతన లైబ్రరీని ప్రారంభిస్తారు. 12.20 గంటలకు మోడ్రన్ ఫుట్‌పాత్‌లను ప్రారంభిస్తారు. 12.40 గంటలకు నగర పాలకసంస్థ నూతన కార్యాలయాన్ని పున:ప్రారంభిస్తారు. 1.15 గంటలకు మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం, 1.15 గంటలకు వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. 2 గంటలకు గోళ్లపాడు చానల్ డైవర్షన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. 2.15 గంటలకు బోనకల్ రోడ్‌లోని కార్పొరేషన్ నర్సరీని ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభ, పున:ప్రారంభ పనులతో కేటీఆర్ టూర్ సాగనుంది.
ఫ్లెక్సీల్లోనూ వర్గపోరు...!
కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ నడుస్తోంది. అనేక ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కేటీఆర్, అజరు చిత్రాలతో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్ చిత్రాలు తప్ప మిగిలిన వారి ఫొటోలు ఎక్కడా కనిపించలేదు. సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్ వేసిన ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్, అజరు ఫొటోలు తప్ప ఏ ఇతర నేత చిత్రాలు లేవు. అత్యధిక కార్పొరేటర్లు అజరు, కేటీఆర్ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఫ్లెక్సీల్లోనూ నూతన ఎంపీలు గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి ఫొటోలు కనిపించకపోవడం చర్చనీయాం శమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల ఫొటోలు ఎక్కడోగానీ కనిపించలేదు.
ఆహ్వానాల్లోనూ విభేదాలే..!
ఇక ఆహ్వానాలు పంపే విషయంలోనూ వర్గపోరు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం లేదని తెలిసింది. ఆయన మినహా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. మంత్రి అజరు నియోజకవర్గంలో సాగే ఈ పర్యటనలో ఎక్కడా మాజీ మంత్రికి చోటులేకుండా శ్రేణులకు ముందస్తుగా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావుకు సైతం జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రారంభానికి ఆహ్వానం అందలేదని సమాచారం. దీనికి సైతం వర్గవిభేదాలే కారణమని తెలుస్తోంది. ఇలా అధికార పార్టీలో అనేక అంతరాలు కేటీఆర్ పర్యటన సందర్భంగా వెలుగుచూస్తున్నాయి. వీటిని రేపటి పర్యటనలో ఏమేరకు ఆయన చక్కబెడతారో చూడాలి.