Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : ఏడీఏ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల కేంద్రంలోని రైతు వేడుకలో జీలుగు విత్తనాలపై రైతులు, వ్యాపారులకు స్థానిక వ్యవసాయ శాఖాధికారి అశోక్ అధ్యక్షతన మణుగూరు డివిజన్ ఏడీఏ తాతారావు శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి విస్తారంగా ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాలతో అధికారులు ఆయా జిల్లా, మండలాల స్థాయిలో రైతులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదే క్రమంలో రైతులు డెబ్బై శాతం నేల తడిసిన తర్వాతే విత్తనాలు వేయాలని తెలిపారు. పత్తి గింజలు వేసే క్రమంలో మొక్కకు మొక్కకు మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం, సాలుకు సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండాలని సూచించారు. అలాగే రైతులు చేతితో వరినాట్లు వేసే పాత పద్ధతిని విడనాడి, కరియాధ పద్ధతినే పాటించాలన్నారు. అనంతరం మండలంలో కొందరు వ్యాపారస్తులు గిరిజన రైతులకు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్ముతున్నారని, పట్టా పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని ఆదీవాసీ గిరిజన పరిషత్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటువంటి వ్యాపారులపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తదనంతరం స్థానిక రైతులకు చౌకగా లభించే జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, సర్పంచ్ మెస్సు కోటేశ్వరరావు, వ్యాపారస్తులు జి.శ్రీనివాస్, ఎ.నాగేశ్వర్రావు, ఎ.వెంకటేశ్వర్ రావు, బి.రాములు, టి.రామ్మూర్తి, ఎ.వెంకటేశ్వర్లు, టి.నాగేశ్వర్రావు రైతులు పాల్గొన్నారు.