Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో కమలాపురం గ్రామంలో పేదలకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇంటి స్థలాలలో రెవెన్యూ అధికారులు క్రీడా మైదానం పేరుతో శుక్రవారం ఆ స్థలంలో పనులు మొదలుపెట్టగా ఇంటి స్థలాల లబ్ధిదారులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదం చేసి గుడిసెలు వేశారు.
మండల పరిధిలో కమలాపురం గ్రామంలో 2007లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామంలోని ఓరైతు దగ్గర ఆ స్థలాన్ని కొని 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. లబ్ధిదారులు పేరుతో పట్టాలు కూడా అందజేసింది. ఆ స్థలాన్ని లబ్ధిదారులు స్వాధీనం చేసుకొని వారి ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఆదేశాలలో భాగంగా రెవెన్యూ అధికారులు గ్రామగ్రామాన క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తూ కమలాపురం గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని క్రీడా మైదానానికి ఎంపిక చేశారు. కాగా ఆ స్థలం లబ్ధిదారులు, అధికారుల మధ్య కొంత వివాదం చెలరేగి ఇంటి స్థలాల లబ్ధిదారులు గుడిసెల వేశారు.
మూడు సంవత్సరాలు దాటితే స్థలం స్వాధీనం : తాసిల్దార్ టి శ్రీనివాస్
ప్రభుత్వం పంపిన చేసిన స్థలాన్ని లబ్ధిదారులు మూడు సంవత్సరాలలోపు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునని ''నవతెలంగాణ దినపత్రికకు'' తాసిల్దార్ టి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
క్రీడా మైదానాల పేరుతో పేదల భూమిని లాక్కొకుంటున్న ప్రభుత్వం
పేదలు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కొని క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం అన్యాయమని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షకార్యదర్శి రాయల శ్రీనివాసరావు, వేల్పుల భద్రయ్య అన్నారు. శుక్రవారం వారు నవతెలంగాణతో మాట్లాడారు. క్రీడా మైదానాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ప్రకతివనం,నర్సరీల పేరుతో పేదల నుండి భూములు లాక్కొని నిరాశ్రయులను చేశారని వారు విమర్శించారు. క్రీడా మైదానాలు, ప్రకృతి వనాలు, నర్సరీలు వల్ల ప్రజలకు ఉపయోగం లేదని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండలంలో ఏర్పాటు చేసే క్రీడా మైదానాలను పేదల భూముల్లో కాకుండా ప్రభుత్వ భూములు ఏర్పాటు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. పేదల భూములు లాక్కుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేద రైతులకు అండగా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము క్రీడా మైదానాల పేరుతో పేదల భూములను లాక్కోవటం మానుకోవాలన్నారు.