Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్ధన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇఫ్టు కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక గతంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా కుదించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసం కార్మికుల శ్రమను దోచి పెడుతున్నారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నైనా నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయవద్దని డిమాండ్ చేసారు. కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం రూ.25వేలలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు నాయకులు కొప్పుల శ్రీనివాస్, మోత్కూరి మల్లికార్జున్, నరాటి వెంకన్న, రాయండ్ల కోటిలింగం, రామిశెట్టి నరసింహారావు, మేకల వినోద్ లు పాల్గొన్నారు.