Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగులేసి...నాలుగు లైట్లు పెడితే అభివృద్ధా?
- డంపింగ్ సమస్యకు పరిష్కారం చూపరా..?
- మున్నేరు బ్రిడ్జి, కరకట్ట నిర్మాణం ఏదీ?
- పాతబస్టాండ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్
- డబుల్ బెడ్రూం స్కీంలో పూర్తిగా విఫలం
- సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరం సమస్యలకు నిలయంగా మారిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. రంగులేసి, నాలుగు లైట్లు పెడితే అభివృద్ధా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో నెలకొన్న సమస్యలను శనివారం నాడు నగర పర్యటనకు వచ్చే రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లేందుకు శుక్రవారం స్థానిక సుందరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఒక్క సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. నగరాన్ని చెత్త డంపింగ్ సమస్య వెంటాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారం మాటున టీఆర్ఎస్ కార్పొరేటర్లు, వారి కుటుంబీకులు చేస్తున్న భూదందాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకుని అధికార పార్టీ నేతలు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి అజరు ప్రతిష్టకు పోయి ఖమ్మం పాతబస్టాండ్‌ను ఎత్తివేశారని ఆరోపిం చారు. బస్టాండ్ ఆధారంగా కొనసాగే వర్తకవ్యాపారాలను దెబ్బతీశారని, ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడంతో అనేక మంది పేదలకు ఉపాధి కోల్పోయారన్నారు. పాత బస్టాండ్‌ను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాతబస్టాండ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లయినా గోళ్లపాడు చానల్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. సారథినగర్ రైల్వే అండ్బ్రిడ్జి నిర్మాణాన్ని ఉపయోగంలోకి తేవాలని కోరారు. కాలపరిమితి తీరిన మున్నేరుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు గతంలో ఇచ్చిన హామీ మేరకు కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రకటన వెలువడి ఆరునెలలైనా ఇంతవరకూ ఎక్కడ నిర్మిస్తారో? ఎప్పుడు నిర్మిస్తారో? స్పష్టత లేదన్నారు. ఖమ్మంలో యూనివర్శిటీ ఏర్పాటు ఊసేలేదన్నారు. డబుల్బెడ్రూం స్కీం అమలులో ప్రభుత్వం విఫలమైంద న్నారు. స్థలాలుంటే ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్న హామీయే కానీ ఇంత వరకూ ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరిన దాఖలాలు లేవన్నారు.
ఆసరా ఫెన్షన్లను అధోగతి పాలుచేశారని, వయోపరిమితి మించి ఐదు, పదేళ్లు అధికంగా వచ్చినా పింఛన్లు అందడం లేదన్నారు. ఇంటికొకర్నే పెన్షన్ లబ్ధిదారులుగా గుర్తించడం సరికాదన్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయన్నారు. టెండర్లలో టీఆర్ఎస్ నాయకుల ఆధిపత్య పోరు కారణంగా దాన్వాయిగూడెం- పాపటపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రభుత్వ స్థలాలు అనేకం ఖాళీ ఉన్నా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో నిర్మిస్తు న్నారన్నారు.
అధికారపార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల భూదందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంద న్నారు. పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారన్నారు. వీటన్నింటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, వై.విక్రమ్, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.