Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం హామీ
నవతెలంగాణ-పాల్వంచ
కేటీపీఎస్ ఆరవ దశ నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అండగా నిలుస్తామని అఖిలపక్షం నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీ హామీ ఇచ్చారు. ఆదివారం ఒడ్డుగూడెంలో కేటీపీఎస్ ఆరవ దశ నిర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్షం నాయకులు బీజేపీ జిల్లా అద్యక్షులు కోనేరు సత్యనారాయణ(చిన్ని), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు ఎడవల్లి కృష్ణ, బీఎస్పి జిల్లా అద్యక్షులు ఎర్రా కామేశ్, టిఆర్ఎస్ నాయకులు మంజూర్ఆలీ ఖాన్, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు మజీద్, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు రత్నాకర్, బిఎంపిఎస్ రాష్ట్ర నాయకులు భూక్యా వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ కేటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో పూర్తి అయితే ఆరవ దశ నిర్మాణంలో పనిచేసిన కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ఆనాడు జెన్కో అధికారులు హామీ ఇచ్చి తీవ్ర అన్యాయం చేయడం సరైంది కాదని అన్నారు. నిర్మాణ కార్మికుల జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుందని ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మీకు అండగా నిలుస్తామని అవసరం అనుకుంటే నేరుగా ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరకు వెళ్లి సమస్యను వివరిద్దామని చెప్పారు. మీరందరికి ఉపాధి దొరికే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సుమారు 200 మంది ఉన్న ఆ కార్మికులు రాత్రనక పగలనక కష్టపడి రాష్ట్రానికే వెలుగులు నింపిన నిర్మాణ కార్మికుల పట్ల యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరానిదని అన్నారు. ఈ సమావేశంలో జేఏసి గౌరవ అద్యక్షులు ఎస్ఏ రావూఫ్, చైర్మెన్ వన్నాపురం శ్రీనివాసరావు, కోకన్వినర్ కొండపాటు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.