Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజయ్‌ను రక్షించడానికే కేటీఆర్ ఖమ్మం పర్యటన
- నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
నవతెలంగాణ- ఖమ్మం
మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో 8 ఎనిమిది ఏండ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి చెప్పలేకపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపించారు.ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ 8 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, అందుకే మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రతి ఒక్కరిపై 4 నుంచి 5 లక్షల అప్పు మోపారని విమర్శించారు. స్థానిక మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు ఓటమి భయం పట్టుకుందని, తనకు ధైర్యం చెప్పేందుకే మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభ జరిగిన తీరు, అక్కడకు జనాల్ని తీసుకు వచ్చిన తీరు చూస్తుంటే అది టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభగా ఉందే తప్ప ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలా లేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున డంపింగ్ యార్డ్ తదితర సమస్యలపై మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్తే అడ్డుకోవడం దారుణమని అన్నారు. అంతేకాకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇక్కడున్న పోలీసులు సరిపోనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండి పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ భద్రత ఏర్పాటు చేయడం పట్ల టిిఆర్ఎస్ పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందని అన్నారు. గతంలో ఖమ్మం పర్యటనలో భాగంగా కేటీఆర్ 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తాం అని చెప్పి ఇప్పుడు 2వేల ఇల్లు మాత్రమే నిర్మించామని చెప్పడం సిగ్గుచేటన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి తిరిగి ఏం మోఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారో చెప్పాలని అన్నారు. ఈ మధ్యకాలంలో మహిళలపై అధికార పార్టీ నేతల సంబంధీకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విపరితంగా పెరిగి పోయిందని, మైనర్లకూ మద్యం అమ్ముతూ ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పోలీసులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరిస్తున్నారని, రఘునాధపాలెం మండలంలో జరిగిన ఓ సంఘటనే దీనికి నిదర్శనమని అన్నారు. సామాన్యులకు అయితే ఒక న్యాయం పార్టీ అనుచరులకు అయితే మరో న్యాయం అన్నట్టుగా ఉందని ఆరోపించారు. హైటెక్ బస్ స్టాండ్ గా గొప్పలు చెప్పుకుంటున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణంలో నాణ్యత పాటించలేదని అన్నారు. గోళ్లపాడు ఛానల్ కాంట్రాక్టు విషయంలో ఆరు శాతం వాటా కోసం మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం తోపాటు నగరంలో సైడ్ డ్రైన్ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇవన్నీ మంత్రి కేటీఆర్‌కు తెలిసినా పువ్వాడను శభాష్ అనడం చాలా రకాల అనుమానాలకు తావిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలోనే నామరూపాలు లేకుండా పోతుందని అట్లాంటిది దేశంలో చక్రం తిప్పుతామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, రఘునాథపాలెం మండల బాధ్యులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కొంటె ముక్కల నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, ఏలూరి రవి తదితరులు పాల్గొన్నారు.