Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ తీరుపై ఆగ్రహం
- రెండు ముక్కలుగా చీలనున్న పాలకవర్గం
- వేరే కుంపటి పెట్టుకొనేందుకు రంగం సిద్ధం
నవ తెలంగాణ - బోనకల్
రాపల్లి టిఆర్ఎస్లో ముసలం ముదిరి పాకాన పడింది. ఆ గ్రామ సర్పంచ్, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు వ్యవహారశైలిపై మెజార్టీ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. రాపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం లో ఏకపక్షంగా ఉన్న టిఆర్ఎస్ అతి త్వరలో రెండు ముక్కలుగా కాబోతుందని నేరుగా టిఆర్ఎస్ నాయకులే మీడియా మిత్రులకు ఫోన్లు చేసి బహిరంగంగా చెబుతున్నారు. తిరుమల రావు వైఖరిపై మండి పడుతూ నిరసనగా ఆదివారం టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ పెట్టాడు. దీంతో టిఆర్ఎస్ లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయనే విషయం వెలుగు చూసింది. మండల పరిధిలోని రాపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మందడపు తిరుమల రావు ఎన్నికయ్యాడు. పంచాయతీ పాలకవర్గం మొత్తం ఎనిమిది మంది కాగా ఎనిమిది మంది పాలకవర్గం సభ్యులుగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు. ఈ మూడు సంవత్సరాల నుంచి తిరుమల రావు కి గ్రామపంచాయతీలో, టిఆర్ఎస్ లో ఎదురులేని, తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యాడు. ఒక సంవత్సరం నుంచి టిఆర్ఎస్ లో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. రాపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త తోట చలపతి, చావా రవి బీసీ ఎస్సీ కాలనీకి చెందిన మెజారిటీ నాయకులు కార్యకర్తలు మందడపు తిరుమలరావు వైఖరిపై విసిగి వేసారి టిఆర్ఎస్ లోనే ఒక వర్గంగా చలామణి అవుతూ వస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా 78 వేల రూపాయలు విత్ డ్రా చేసి ఇంకుడు గుంటల కట్టిన కాంట్రాక్టర్ కు చెల్లించడంతో తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి సరిగ్గా లెక్కలు చెప్పకపోవడంతో వీరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులకు కూడా తిరుమల రావు లెక్కల స్పష్టంగా చెప్పటం లేదని అదేమని అడిగితే నాకు తెలియదు అంటూ సమాధానం చెబుతున్నాడని పాలకవర్గంలోనే సభ్యులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా మంచి జరిగితే తానే చేశానని, నష్టం జరిగితే నాకు తెలియదని, నాకు సంబంధం లేదని మమ్మలను ఇరికించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని పలువురు టిఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే గ్రామంలో వ్యాఖ్యా నిస్తున్నారు. సర్పంచి వైఖరిలో మార్పు వస్తుందని ఇంత కాలం వేచి చూశామని కానీ అతనిలో మార్పు రాకపోవటంతో తామే కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నామని గ్రామపంచాయతీ పాలకవర్గం లో కొంతమంది సభ్యులు అంటున్నారు. అందులో భాగంగానే రెండు మూడు రోజులలో సర్పంచ్ వైఖరికి నిరసనగా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహా ప్రస్థానం పాదయాత్ర తో ఈ నెల 10వ తేదీన రా పల్లి గ్రామం వచ్చింది. రాపల్లి బహిరంగసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై ఘాటైన పదాలతో విమర్శల వర్షం కురిపించింది. ఆ సమయంలో సర్పంచ్ కూడా అక్కడే ఉన్నాడు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర గా వెళ్తున్న వైఎస్ షర్మిలను కలిసి రెండు చేతులతో జోడించి దండం పెట్టి సంఘీభావం తెలిపారు. ఒకవైపు కెసిఆర్ పై, టిఆర్ఎస్ ఘాటైన విమర్శలు చేసిన షర్మిలకు సంఘీభావం తెలపడం పట్ల అక్కడే ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహంతో రగిలిపోయారు. మన నాయకుడిని తిట్టిన షర్మిలను ఎలా కలిసి సంఘీభావం తెలిపారు అంటూ సర్పంచ్ తీరుపై రోడ్డుపైనే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు చర్చించుకున్నారు. ఈ విషయంపై టిఆర్ఎస్ జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సర్పంచ్ తీరుపై జిల్లా నాయకత్వానికి మధిర డివిజన్ కన్వీనర్కి అదే రోజు ఫిర్యాదు చేశారు. దీంతో టిఆర్ఎస్లో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ రాపల్లి గ్రామ నాయకుడు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యురాలు భర్త ఏనుగు రవి ఘాటైన పదజాలంతో ఆదివారం సోషల్ మీడియాలో తిరుమలరావు పై పోస్టింగ్ పెట్టాడు.