Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడి వేళైంది..
- నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం
- పది లక్షల పుస్తకాలకు 30వేలే రాక
- కరోనా నాటి నుంచి అందని యూనిఫాం
- విరిగిన తలుపులు, కూలిన ప్రహరీగోడలు
- పాఠశాలల ఆవరణలో మద్యం బాటిళ్లు
- అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విరిగిన తలుపులు, కిటికీలు...పగిలిన బెంచిలు...కూలిన తరగతి గది, ప్రహరీగోడలు... ప్రాంగణంలో మద్యం బాటిళ్లు... చెత్తాచెదారంతో ఆవరణలు...తాండవిస్తున్న అపరిశుభ్రత... ఇవీ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న దుస్థితి. 'మన ఊరు- మన బస్తీ- మన బడి' అంటూ హడావుడే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదని పరిస్థితులను వీటినిబట్ట్టి అర్థమవుతోంది. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 10 తరగతుల వరకు నిర్వహించే 1217 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు లక్ష మంది వరకూ చదువుతు న్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతుండగా విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫాం వచ్చినట్లు లేదు. వేసవి సెలవుల్లోనే సరిపడా దుస్తులు, పుస్తకాలుసమకూర్చాల్సినప్పటికీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదు. మరోవైపు రూ.15 లక్షలలోపు అవసరమయ్యే స్కూల్స్‌కు 'మన ఊరు- మనబడి, మనబస్తి- మన బడి' కార్యక్రమంలో తొలి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఆ పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో పనులు నిర్వహించిన దాఖలాలు లేవు. మండలానికి రెండు పాఠశాలల చొప్పున ఏప్రిల్ 9న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. స్కూల్స్ పున:ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టినప్పటికీ అరకొర పనులే పూర్తయ్యాయి. పదిలోపు స్కూల్స్‌లోనే పూర్తిస్థాయిలో పనులు నిర్వహించారు.
అరకొర వసతుల మధ్యే...
గత రెండేళ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేదు. 2020-21 విద్యాసంవత్సరంలో దాదాపు ఆన్లైన్ తరగతులకే పరిమితం కాగా...2021-22లో సెప్టెంబర్‌లో స్కూల్స్ తెరిచారు. ఏప్రిల్ వరకు పాఠశాలలు నిర్వహించారు. సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం చేస్తున్నారు. కానీ నేటి వరకూ విద్యార్థులకు సరిపడా పుస్తకాలను విద్యాశాఖ సమకూర్చలేదు. సుమారు లక్ష మంది విద్యార్థులకు పది లక్షల పుస్తకాలు అవసరం ఉండగా 30వేల పుస్తకాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అరకొర పుస్తకాలను విద్యార్థులకు ఎలా అందించాలనే యోచనలో అధికారయంత్రాంగం ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులకు యూనిఫాం అందించలేదు. ఈ ఏడాది సకాలంలో పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు వెంటనే రెండు జతల దుస్తులు అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లాత్ ఇప్పటి వరకూ జిల్లాకు చేరకపోవడం గమనార్హం. ఇక జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రహరీగోడలు, వంటశాలలు లేవు. మిషన్ భగీరథ నీరు విద్యార్థులకందే పరిస్థితి లేదు. పలు పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బెంచిలు విరిగి ఉన్నాయి. కొన్ని పాఠశాలల ఆవరణలో వాడిపడేసిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. పారిశుధ్య లోపంతో మూత్రశాలలు, పాఠశాల ఆవరణలో దుర్వాసన వస్తోంది. కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, ప్రాంగణాలనూ శుభ్రం చేయ లేదు. ఇక పాఠశాలల్లో స్కావెంజర్లు, విద్యా వాలంటీర్లను నియమించలేదు. ఇదే విషయమై టీఎస్ యూటీఎఫ్ ఇటీవల కలెక్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం అందించింది.
పాఠ్యపుస్తకాలు దారిమళ్లించకుండా...
ఇకపోతే పాఠ్యపుస్తకాలు దారిమళ్లించకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత రెండేళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేసే పుస్తకాలపై ప్రత్యేకంగా సంఖ్యను ముద్రించడంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తోంది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ ఆధారంగా పుస్తకాలు అందిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత పుస్తకాలు అందుతున్నాయి.
పాఠ్యపుస్తకాలు అందించాలి..స్కావెంజర్లను నియమించాలి
- పారుపల్లి నాగేశ్వరరావు, టీఎస్‌యూటీఎఫ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి
నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న దృష్ట్యా ఇప్పటికే విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వచ్చి ఉండాల్సింది. కానీ రాలేదు. అలాగే స్కూల్స్‌లో ఖాళీలను భర్తీ చేసే వరకు విద్యావాలంటీర్లను నియమించాలి. స్కూల్స్‌లో స్కాంవెంజర్లు లేకపోవడం వల్ల పారిశుధ్యం లోపిస్తోంది. ఈ విషయమై 10వ తేదీన జిల్లా కలెక్టర్‌కు తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1673 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 1,44,796 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో 368 పాఠశాలలు ఎంపిక చేశారు. 365 పాఠశాలలకు మరమ్మతులు చేసేందుకు పరిపాలన అనుమతులు వచ్చాయి. జిల్లాలో మొత్తం అంగన్వాడి సెంటర్ల ద్వారా 2,263 మంది పిల్లలను పాఠశాలలకు పంపేందుకు గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 8503 మంది ఉపాధ్యా యులకు ఆన్లైన్ ద్వారా ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ ఇచ్చింది. అధిక సంఖ్యలో పాఠశాలలకు స్కావెంజర్స్ లేరు. ప్రభుత్వం స్థానిక పంచాయతీ, మున్సిపల్ కార్యాలయం నుండి స్కావెంజర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. జిల్లాలో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు లేని 368 పాఠశాలలను గుర్తించారు.
సౌకర్యాలు కల్పించాం.. టీచర్ల కొరత అధిగమిస్తాం
సోమశేఖర శర్మ, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాం. 365 స్కూల్స్‌లో వసతులు మెరుగయ్యాయి. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాల నుండి విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపించి టీచర్ల కొరతను అధిగమిస్తాం.