Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్లో ఖమ్మం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందన్నారు. నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయికి చేరాయని, వాటిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అప్పుల రాష్ట్రంగా మార్చి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం నెట్టివేయబడిందనన్నారు. సంక్షేమ పథకాలు హామీల తప్ప అమలు చేయలేదని వారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు నిర్వహించాలని, కార్యకర్తలందరూ గ్రామం యూనిట్ గా పోరాటాలకి ప్లాన్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.