Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు సంవత్సరాలుగా సాగుతున్న 'ధ్వంసం' సంఘటనలు
- ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోనే ఆళ్లపాడు గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అరాచకవాదులు అరాచకం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ విద్యుత్ మోటార్ల ధ్వంసం నుంచి ప్రస్తుతం పంటల దగ్ధం ప్రారంభించారు. దుండగులు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, దుండగులు ఎందుకు పట్టు పడటం లేదనే అనుమానాలు గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆళ్లపాడు గ్రామంలోని ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అంతుపట్టకుండా ఉంది. 2 సంవత్సరాల క్రితం వ్యవసాయ విద్యుత్ మోటార్ల ధ్వంసంతో అరాచకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విద్యుత్ మోటార్లను ధ్వంసం చేసి ఆ మోటార్లను వాగులలో, బావులలో పడేయటం ప్రారంభించారు. అయితే పక్కనే ఉన్న కొంతమంది వ్యవసాయ విద్యుత్ మోటార్ల జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యానికి, పలు అనుమానాలకు తావిస్తోంది. వరుసగా విద్యుత్ వ్యవసాయ మోటార్లు ఉన్నప్పటికీ కొంత మంది రైతుల మోటార్లను మాత్రమే ధ్వంసం చేస్తున్నారు. దాదాపు నేటికీ 20 మంది రైతులకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ మోటార్లను రెండు సంవత్సరాలుగా పలు దఫాలుగా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. అయితే 3 నెలల క్రితం ఆళ్లపాడు గ్రామంలో ఏ విధంగా విద్యుత్ వ్యవసాయ మోటార్లను ధ్వంసం చేశారో అదేవిధంగా రామాపురం గ్రామంలోనూ జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. వాళ్లే వీళ్లా లేకపోతే కొత్త వారా, అసలు రామాపురంలో ఈ సంఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారనేది మిస్టరీగా మారింది. సంఘటనలు జరిగిన ప్రతిసారి బాధిత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఆళ్లపాడు గ్రామంలో చలివేంద్రం ప్రారంభం సందర్భంగా బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత విద్యుత్ మోటార్ల ధ్వంసం పై ఘాటయిన హెచ్చరికలు చేశారు. ఆ రోజు రాత్రే చలివేంద్రం ప్రారంభించడానికి వస్తున్న ఎస్సై తేజావత్ కవిత ఫ్లెక్సీని చలివేంద్రం నిర్వాహకులు ఏర్పాటు చేయగా తెల్లవారేసరికి ఆ ఫ్లెక్సీని అరాచకవాదులు మూడు ముక్కలుగా కోశారు. ఒక ఎస్సై పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దుండగులు ధ్వంసం చేసి ఒక రకంగా పోలీసుశాఖకు సవాలు విసిరినట్లు అయింది. ఇది ఇలా ఉండగానే మే 29న ఆళ్లపాడు గ్రామానికి చెందిన రైతు వేముల రామారావుకు చెందిన ఐదు ఎకరాల వరిగడ్డి వామిని, జూన్ 1న మరో ఇద్దరు రైతులకు చెందిన ఏడు ఎకరాల వరి గడ్డి వామిని 4న మంద కృష్ణకు చెందిన ఐదు ఎకరాల వరి గడ్డి వామిని దుండగులు దగ్ధం చేశారు. అక్కడ అగ్గి పడేసి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఆళ్లపాడు గ్రామం లోనే ఎందుకు కొనసాగుతుందనే ప్రశ్న మిస్టరీగా మారింది. నిఘా వేసిన రోజులలో మాత్రం ఎటువంటి సంఘటనలు జరగటం లేదు. నిఘా వేయకుండా ఉన్న రోజులలో మరల యథావిధంగా చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. స్థానికులు ఇలా చేస్తున్నారని పోలీసులు వారిని పట్టుకోవాలని కోరుతున్నారు.
ఐదు ఎకరాల వరి గడ్డి వామి ని దగ్ధం చేశారు : కందుల శ్రీను, ఆళ్లపాడు
ఐదు ఎకరాల వరి గడ్డి వాములను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. గ్రామంలో తనకు ఎవరితోనూ వివాదాలు లేవు, అయినా తన వరిగడ్డి వామిని దగ్ధం చేశారు. దీని వల్ల తనకు 50 వేల రూపాయల నష్టం వాటిల్లింది. తనతో పాటు ఇతర రైతుల కు చెందిన వరి గడ్డి వాములను కూడా దగ్ధం చేశారు. ఇటువంటి పనులకు ఎవరు పాల్పడుతున్నారో ఎందుకు పాల్పడుతున్నారో మా రైతులకు అర్థం కావడం లేదు. ఇటువంటి వారిపై పోలీస్ శాఖ పెట్టి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి.
విచారణ చేపడుతున్నాం : ఎస్ఐ తేజావత్ కవిత వివరణ
ఆళ్లపాడులో వరుస మోటార్ల ధ్వంసం, గడ్డివాములు దగ్ధం విషయమే బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వివిధ రూపాలలో విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.