Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వేల 89 ఎకరాల్లో పత్తి సాగు
- గత ఏడాది కంటే 4వేల ఎకరాల్లో పత్తి సాగు పెంపు
- వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం
- వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ద్ధం
నవతెలంగాణ-బూర్గంపాడు
వానాకాలం సాగులో రైతులు పత్తి పంట సాగు వైపే అధికంగా మొగ్గు చూపుతున్నారు.. రైతులకు అధిక లాభాలు ఇచ్చే పత్తి సాగు పైనే ఈ ఏడాది కూడా ఆశలు పెట్టుకొని రైతులు సన్నద్ధం కానున్నారు. రైతులకు కనక వర్షాన్ని కురిపించే పత్తి సాగు పైనే రైతులు ఆశలు పెట్టు కుని మరీ మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది కూడా పత్తి ధర ఆశాజనకంగానే ఉండడంతో ఈ ఏడాది కూడా పత్తి పంట సాగు చేసేలా రైతులు సిద్ధమవుతున్నట్టు తెలు స్తోంది. ఈ క్రమంలో పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో గత ఏడాది కంటే అధికంగా ఈ ఏడాది వాన కాల సాగులో పత్తి పంట సాగు చేయాలనే రైతులు కోటి ఆశలతో ముందుకు సాగుతున్నా రు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలు పైగానే పత్తి పంట సాగు చేయనున్నారు.
50వేల 89 ఎకరాల్లో పత్తి:
పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ఏడాది రైతులు 50 వేల 89 ఎకరాల్లో పత్తి సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఏడాది 46 వేల 493 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఏడాది సుమారు నాలుగు వేల ఎకరాల్లో పత్తి సాగు మరింత పెరగనుంది. ఆళ్ళపల్లి మండలంలో పత్తి సాగు 7,171 ఎకరాల్లో, అశ్వాపురంలో 17 వేల ఐదు వందల 99 ఎకరాల్లో, బూర్గంపాడులో 12,672 ఎకరాల్లో, గుండాలలో 5,188 ఎకరాల్లో, కరకగూడెంలో 3,503 ఎకరాల్లో, మణుగూరులో 3,486ఎకరాల్లో, పినపాకలో 510 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఆయా మండలాల్లో రైతులు సాగు చేసే పంటలపై సర్వే నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది కంటే పినపాక నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలకు పైగా పత్తి సాగు రైతులు చేయనున్నారు. ప్రధానంగా బూర్గంపాడు మండలంలో గత ఏడాది 11 వేల నూట డబ్భై రెండు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసిన రైతులు ఈ ఏడాది 12,672 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. అదేవిధంగా అశ్వాపురం, గుండాల, కరకగూడెం మండలాల్లో గత ఏడాది కంటే ఎక్కువగా పత్తిని సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
53,526 ఎకరాల్లో వరి పంట సాగు
పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏడాది 53,784 ఎకరాల్లో వరి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది 53,570 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ఈ ఏడాది సుమారు 214 ఎకరాల్లో అధికంగా వరిని సాగు చేయనున్నారు. ఆళ్ల పల్లి మండలంలో వరి 3,695 ఎకరాల్లో, అశ్వాపురంలో 8,239 ఎకరాల్లో, బూర్గంపాడులో 6,500 ఎకరాలలో, గుండాలలో మూడు వేల 45 ఎకరాల్లో, కరకగూడెంలో 11 వేల ఐదు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో, మణుగ ూరులో 7,231 ఎకరాల్లో, పినపాకలో 13,550 ఎకరా లలో వరి పంటను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమ వుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏడాదితో పోలిస్తే పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కేవలం 214 ఎకరాల్లోని వరి పంటను అధికంగా పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, కరకగూడెం మండలాలలో వరి పంట సాగు అధికంగా రైతులు చేపడుతున్నారు. వర్షాధారిత, సాగునీటి సౌకర్యం, చెరువులు, కుంటలపై ఆధారపడి వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు.
ఇతర పంటల సాగు:
పినపాక నియోజకవర్గంలో రైతులు సాగు చేసే పంటలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. వరి పత్తి పంటలతో పాటు రైతులు ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూ పుతున్నారు. ఏడు మండలాల్లో చెరకు 25 ఎకరాల్లో ,మొక్కజొన్న 13 ఎకరాల్లో, మినుము 140 ఎకరాల్లో, పచ్చి మిర్చి 141 ఎకరాల్లో రైతులు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ శాఖ పేర్కొంది. అదేవిధంగా కందులు 3,819 ఎకరాల్లో, నువ్వులు 77 ఎకరాల్లో, వేరుశనగ 15 ఎకరాల్లో, జీడిపప్పు 161 ఎకరాల్లో, పండుమిర్చి 3041 ఎకరాల్లో, మామిడి 875 ఎకరాల్లో రైతులు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
సాగుకు రైతులు సన్నద్ధం
పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధంగా ఉన్నారు. రైతులు ఈ ఏడాది వరి పంట కంటే ఎక్కువగా పత్తి పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు ఎకరాల పైగానే వరి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలతో ముందుకు సాగాలి. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు రావాలంటే వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు అనుసరించాలి.
- వ్యవసాయ శాఖ ఏడీఏ తాతారావు