Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోరు తెరిస్తే తిట్ల దండకం
- ఏ తప్పూ లేకున్నా ముఖం మీదే ఫైళ్లు విసిరికొడుతున్న వైనం
- కేంద్రాల విజిట్‌కు వెళితే రికార్డులు ఎత్తుకొస్తున్న సీడీపీవో జ్యోత్స్న
- ఆమె ఇక్కడే ఉంటే ఉద్యోగం చేయలే మంటూ.. మూకుమ్మడి సెలవులు, రాజీనామాలకు సిద్ధమవుతున్న టీచర్లు
- సీడీపీవోను బదిలీ చేయించాలని ఎమ్మెల్యేకు వేడుకోలు
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో జ్యోత్స్న. తన షాడిజంతో టీచర్లు, ఆయాలను సూటిపోటి మాటలతో హేళన చేస్తూ, వేధిస్తూ హింసిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పరిధిలో మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) మండలాలు ఉండగా 136 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. పది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 126 మంది టీచర్లు, 117 మంది ఆయాలు, ఐదుగురు సూపర్వైజర్లు పని చేస్తున్నారు. పైస్థాయిలో ఉన్న అధికారి హూందాతనంగా వ్యవహరించాల్సింది పోయి సాటి మహిళలు అన్న కనీస గౌరవం, మర్యాద కూడా లేకుండా సహనం కోల్పోయి నోటి దురుసుతో నిత్యం తమను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో 'మిమ్ములను' తిడుతుంటే, వేధిస్తుంటే నాకు హాయిగా ఉంటుందని తోటి ఉద్యోగుల ముందే వ్యాఖ్యానిస్తోందంటే ఆమె షాడిజం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యూటీ పరంగా ఏ పని చెప్పినా చేస్తున్నామని, రిమార్కులు, తప్పులు చూపకుండా రికార్డుల్లో అడ్డగీతలు గీస్తుందని, రికార్డులను ముఖం మీదే కొడుతుందని, ఏదైన రిపోర్ట్ అడిగితే ఒక్కసారి చెప్పదని, నాలుగైదు సార్లు మార్చిమార్చి చెబితే తాము రిపోర్టులు ఎలా ఇస్తామని, కేంద్రాల విజిట్ కు వచ్చిన సమయంలో కారణం చెప్పకుండా రికార్డులు ఎత్తుకపోయి మూడు, నాలుగు రోజులు ఆమె వద్దే పెట్టుకుని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుందని వాపోతున్నారు. సీడీపీవో పోరు భరించలేకపోతున్నామని, ఈ టార్చర్ తో తాము ఉద్యోగాలు చేయలేమని కన్నీటిపర్యంత మవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
మూకుమ్మడి సెలవులు, రాజీనామాలకుసిద్ధమవుతున్న టీచర్లు
సీడీపీవో జ్యోత్స్న పెట్టే టార్చర్ భరించలేక అంగన్వాడి టీచర్లు మూకుమ్మడి సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతుండగా, పలువురు టీచర్లు ఇక ఈ ఉద్యోగం చేయడం తమవల్ల కాదంటూ రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహాడ్ టీచర్ తొగిటి అన్నపూర్ణ కిడ్నీ చెడిపోయి అనారోగ్యానికి గురికాగా అవేవీ పట్టించుకోకుండా సీడీపీవో సమావేశంలోఆమెను నేలపై గంటలకొద్ది కూర్చోబెట్టడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మతి చెందింది. వయస్సు పైబడిన తమ తల్లిని సీడీపీవో వేధించడంతోనే మతి చెందిందని ఆమె కుమారులు ఆరోపించారు. మోదుగుబావిగూడెం సెంటర్ విజిట్ కు వెళ్లిన సమయంలో ఆయాను దూషించడంతో కంగారులో ఆమె కుక్కర్లో పప్పు ఉడికిస్తుండగా ఒక్కసారిగా మూత తీయడంతో శరీరంపై పడి తీవ్రంగా గాయపడిందంటున్నారు. పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ రబియా సీడీపీవోతో వేగలేక ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయింది. జూనియర్ అసిస్టెంట్ రాములు లాంగ్ లీవ్ పెట్టుకుని అటు నుంచి అటేనల్లగొండకు బదిలీ పెట్టుకుని వెళ్లిపోయారు. రాములు ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యే సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని, వారిద్దరి మధ్య పంచాయతీని ప్రాజెక్ట్ పీడీ వచ్చి పరిష్కరించారని ఉద్యోగులే చెబుతున్నారు. ప్రాజెక్ట్ పరిధిలో చాలా మంది 38 ఏండ్లుగా పని చేస్తున్నామని, 30 శాతం టీచర్లు, 40శాతం ఆయాలు 60 ఏండ్లు దాటిన వారు ఉన్నారని, ఈ పని చేయడం మీకు చేతకాదని, జీతాలు దండగని, కారణాలు చూపకుండా జీతాల్లో కోత పెడుతుందని, ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోండని బెదిరిస్తుందని, రాజీనామా చేయమనేందుకు ఆమె ఎవరని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు టీచర్లు, ఒక ఆయాను ఇదే విధంగా బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామా చేయించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈనెలాఖరులోగా చాలా మంది టీచర్లు మూకుమ్మడి సెలవులు పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తీరిగ్గా వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ జెండా ఎగురవేసిందంటే సీడీపీవో సమయపాలన, ఆమె పనితీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
సీడీపీవోను బదిలీ చేయించాలని ఎమ్మెల్యేకు వేడుకోలు
తమను టార్చర్ పెడుతున్న షాడిస్ట్ సీడీపీవోను బదిలీ చేయించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌ను వేడుకుంటున్నారు. ఇప్పటికే సీడీపీవోపై చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ పీడీకి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. 2020 ఏప్రిల్ లో మోత్కూరు సీడీపీవోగా వచ్చిన జ్యోత్స్న రెండేళ్లుగా తమను ఎన్నో బాధలు పెడుతుందని, తమ గోడు వినేవారే కరువయ్యారని వాపోతున్నారు. సీడీపీవో తమను తిడుతున్న తిట్లు, వేధిస్తున్న తీరును ఎమ్మెల్యేకు వివరించి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలను టార్చర్ పెడుతున్న సీడీపీవో జ్యోత్స్నపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా లేక స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తారా అన్నది వేచి చూడాలి.
సీడీపీవో వివరణ: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సూపర్వైజర్లను తిడుతూ వేధిస్తున్న ఆరోపణలపై ఐసిడిఎస్ మోత్కూర్ సీడీపీవో జ్యోత్స్నను వివరణ కోరగా తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. కేంద్రాల్లో పోషక ఆహారం పెట్టని, రికార్డులు సక్రమంగా నిర్వహించని వారికి మెమోలు జారీ చేస్తున్నాం. తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం గానీ, వేధించడం గానీ చేయడం లేదు.
ఐసీడీఎస్ పీడీ వివరణ: ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.కష్ణవేణిని వివరణ కోరగా సీడీపీవో వ్యవహారంపై విచారణ చేస్తాం. సీడీపీవో వేధింపులపై గతంలో ఫిర్యాదు చేసింది వాస్తవమే. మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని టీచర్లను, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడి తదనంతరం చర్యలు తీసుకుంటాం.