Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో ఆయిల్ కొరత సృష్టించినా...ఆయిల్ కల్తీ చేసినా పెట్రోల్ బంకు లైసెన్సులు రద్దుతో పాటు సీజ్ చేస్తామని కలెక్టర్ అనుదీప్ బంక్ యాజమాన్యాలకు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయిల్ విక్రయాలు, స్టాకు నిర్వహణ అంశాలపై రెవిన్యూ, పౌర సరఫరాలు, పెట్రోల్ బంకు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాద్యత యజమానులదేనని తేల్చి చెప్పారు. బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీరు, వాహనాలకు ఉచితంగా గాలి పెట్టడం చేయాలని, ఇట్టి సేవలను ప్రజల నుండి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరుగుదొడ్లు నిర్వహించాలని బంకు యజమానులకు నోటీసులు జారీ చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. ఇటీవల గండుగులపల్లిలో ఆయిల్ విక్రయాలకు అధిక రేటు తీసుకుంటున్నట్లు గుర్తించి అధికారులతో విచారణ నిర్వహించి బంకు సీజ్ చేశామని చెప్పారు. తహసీల్దారులు, పౌర సరఫరాలు, తూనికలు కొలతల అధికారులు బంకుల్లో తనిఖీలు నిర్వహించి సౌకర్యాలు, ఆయిల్ స్టాకు నిర్వహణ అంశాలపై నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, తూనికలు కొలతల అధికారి మనోహర్, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, పెట్రోల్ బంకుల కార్యదర్శి రాధాకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ హరీస్ రాఠీ, జిల్లాలోని 64 బంకుల యజమానులు, పౌర సరఫరాల శాఖ డిటిలు తదితరులు పాల్గొన్నారు.