Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉసూరుమంటున్న ఊరు బడులు
- శిధిలావస్థలో పలు భవనాలు
- తొలిరోజు హాజరు అత్యల్పం
- ఫలితం ఇవ్వని బడిబాట
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ఏడాది ప్రభుత్వ బడులు పుస్తకాలు లేకుండానే ప్రారంభం అయ్యాయి. 70 శాతంపై బడిన విద్యార్ధులు ఉన్న బడులు మాత్రమే మనం ఊరు-మన బడికి ఎంపిక చేసారు. అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న బడులు అనేకం శిధిలావస్థలో నే ఉన్నాయి. తొలి రోజు ఆశించినంత హాజరు శాతం కనిపించలేదు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా ''నవతెలంగాణ'' సోమవారం పలు పాఠశాలలను పరిశీలించగా ఉసూరు మంటు కనిపించాయి.
ఎంఈఓ క్రిష్ణయ్య తెలిపిన వివరాలు ప్రకారం... మండలంలో అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 96 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గతేడాది విద్యార్ధులు వివరాలను బట్టి ఒకటవ తరగతి నుండి పదో తరగతి వరకు మొత్తం 4074 మంది విద్యార్ధిని విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు-మన బడి పధకానికి 70 శాతం పైన ఉన్న 28 పాఠశాలలను మాత్రమే ఎంపిక చేసారు. ఇందులో పరిపాలనా అనుమతులు వచ్చి, నిధులు మంజూరు అయినా పనులు మాత్రం పూర్తి అవలేదు. అయితే మరెన్నో ఇతర పాఠశాల భవనాలు సైతం శిధిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పంచాయతీలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ ప్రాధమిక పాఠశాలలో మొత్తం 10 మంది విద్యార్ధులు ఉన్నప్పటికీ తొలి రోజు ఎవరూ రాకపోయేసరికి ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ తానొక్కడే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. ఈ పాఠశాల భవనాలను 1991లో నిర్మించారు. దీంతో ఇది పురాతన శిధిలంలా గోచరిస్తుంది.
ఇదే పంచాయతీలోని పేట మాలపల్లి ప్రాధమిక పాఠశాల పై కప్పు శిధిలం అయి స్లాబ్‌లోని ఇనుప చువ్వలు బయటపడి ఏ క్షణంలో అయినా కూలేలా కనిపిస్తుంది. దీంతో ఇందులోని విద్యార్ధులు భయం భయంగా గడుపుతున్నారు. ఇంకా హాజరు శాతానికి వేస్తే అయ్యేలా కనిపిస్తుంది. 4074 మంది విద్యార్ధులకు గానూ 1214 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు అయ్యారు. ఈ క్రమంలో ''బడిబాట'' కార్యాచరణ శూన్యంగా కనిపిస్తుంది.