Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు దేశానికే ఆదర్శం
- జలగం ట్రస్ట్ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల):
గుండాల మండలంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య శాలలో స్టాఫ్ నర్స్ ఉండేందుకు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనం 50 లక్షల రూపాయలతో నిర్మించబడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైద్యశాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే మండలంలో ఉన్న రైతులు జలగం ట్రస్ట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని రైతులు బోర్, నది పరివాహక ప్రాంతంలో పట్టా కలిగిన రైతులు కొంత నగదు చెల్లిస్తే మిగతాది ట్రస్ట్ ద్వారా ఆయా కంపెనీకి చెల్లించి విద్యుత్ మోటార్లు అందజేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాదరావు, జడ్పీటీసీ రామక్క, ఎంపీపీ సత్యం, తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, సర్పంచ్ సీతారాములు, వైద్య సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.