Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మన ఊరు-మనబడి కార్యక్రమంలో గట్టుగూడెం యుపియస్ పాఠశాలను ఎంపిక చేయకపోవడం పట్ల ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత కొన్నేళ్ళుగా ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని రెండు అదనపు తరగతి గదులను నిర్మించాలని గ్రామస్తులంతా కలసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం శూన్యం అని గట్టుగూడెం ప్రజలు పేర్కొంటు న్నారు. పాఠశాలలో ప్రత్యేకంగా బాలికలకు బాత్రూంలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ.6 లక్షల వ్యయంతో ఒక కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పినప్పటికీ సోమవారం పాఠశాల పున:ప్రారంభం అయినా బాత్రూంల నిర్మాణం అసంపూర్తిగా ఉందని దీని వలన బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని దీనిపై వెంటనే ప్రజాప్రతినిథులు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తమ పాఠశాలను 8వ తరగతికి అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం నవతెలంగాణ ఎంఈవో కీసరి లకిëని వివరణ కోరగా గట్టుగూడెం పాఠశాలను అప్గ్రేడ్ చేయడం కుదరదని దానికి కారణం 6,7 రెండు తరగతులు కలిపి 40 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండాలని ఆ పాఠశాలలో అంతమంది విద్యార్థినీ విద్యార్థులు లేరని తెలిపారు. అసంపూర్తిగా ఉన్నటువంటి బాత్రూంల విషయంలో నిర్మాణం త్వరితగతిగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె వివరించారు.