Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ఉక్కిరిబిక్కిరికి కారకులెవరు..?
- కైకొండాయిగూడెంలో 50మందికి పైగా అస్వస్థత..
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధిలో రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇటీవల హరిత విభాగంలో రాష్ట్రస్థాయిలో అవార్డు కూడా పొందింది. ఇంత ఘన చరిత్ర ఉన్న ఖమ్మం చెత్తను డంపింగ్ చేసే విషయంలో విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. చెత్త డంపింగ్ సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో, నగర పాలక సంస్థకు చెందిన ట్రాక్టర్లు స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ముఖ్యంగా 1వ డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానవాయిగూడెం సమీపంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. చెత్త రీసైక్లింగ్ ఊసే లేకపోవటంతో చెత్త పేరుకు పోతోంది. పేరుకుపోయిన చెత్తను తగలబెట్టడంతో పొగ నగరాన్ని కమ్ముకుంటున్నది. నగరంలోని 1వ డివిజన్ కైకొండాయిగూడెం రెండురోజుల వ్యవధిలో సుమారు 50మంది తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రిలో వైద్యం పొందారంటే పరిస్థితి తెలుసుకోవచ్చు.
రోజుకు 200 మెట్రిక్ టన్నుల చెత్త..
ఖమ్మం నగరంలో రోజుకు 300 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంటుంది. సుమారు 180 మెట్రికన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నప్పటికీ చెత్త డంపింగ్ సమస్య ఏర్పడుతిందని ప్రజలు పేర్కొంటున్నారు. అదేవిధంగా... రఘునాధపాలెం మండలం కామంచికల్ సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే సదరు డంపింగ్ యార్డు దూరంలో ఉండటమే కాకుండా, రహదారి సరిగా లేకపో వటంతో వాహనాలు అక్కడ వరకు వెళ్లలేక మధ్యలోనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీంతో రఘునాథపాలెం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు నిరసన దీక్షలు చేయటం, వాహనాలను అడ్డుకోవడంతో చెత్తను మళ్ళీ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావటంతో 1వ డివిజన్ కైకొండాయిగూడెం సమీపంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి : పగడాల నాగేశ్వరరావు ఖమ్మం
దానవాయిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలి. గతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చి హామీలను నెరవేర్చలేదని, డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే పొగ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలి.
డంపింగ్ యార్డ్ పొగతో ఉక్కిరిబిక్కిరి : నాగటి ఉపేందర్ కైకొండాయిగూడెం 1వ డివిజన్
దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ వల్ల తమ డివిజన్లో ఇప్పటికే చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికైనా అధికారులు డంపింగ్ యార్డ్‌లో నిప్పు ఎవరు పెడుతున్నారో వారిని గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. పొగ రాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడాలి.
ఇద్దరిపై కేసు నమోదు చేశాం : ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి
దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ లో పొగ రావడానికి కారణం మైన ఇద్దరిపై కేసు నమోదు చేశాం. డంపింగ్ యార్డ్‌లో చెత్త రిసైకిలింగ్ కోసం ఒక సంస్థకి అప్పగించాం. టెండర్లు పూర్తయ్యాయి. డంపింగ్ యార్డ్ లో పొగ సమస్య ఉండదు.