Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-భద్రాచలం
ఆదివాసీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రిడ్జి సెంటర్లో ఘనస్వాగతం పలికారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా భద్రాచలం వచ్చిన ఆయన పట్నంలోని కొన్ని కాలనీలో పర్యటించారు. పలుచోట్ల పార్టీ దిమ్మలను ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం ఆదివాసీలకు అందేలా చూస్తామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి ఆదివాసీలను జైలుకు పంపించే దురాగతాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూను కుంటోందని, ఇది ఎంతవరకు సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. బహుజన రాజ్యంలో తప్పకుండా ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు.
ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతున్న మంటూ చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏలకు ఏ మాత్రం నిధులు ఇవ్వడం లేదని, ఇక ఎక్కడ అభివృద్ధి జరుగుతోందో చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గుత్తికోయలకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీల తగ్గింపుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో బీఎస్పీ నాయకులు కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.