Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కాలనీలో రాలిపడిన శ్లాబు పెచ్చులు
- వృద్ధురాలి తలకి తీవ్రగాయాలు
- ఏడాదిన్నర పాపకి తప్పిన ప్రమాదం
- భయాందోళనలో కిష్టారం ప్రజలు
నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణి బాంబు పేలుళ్ల ధాటికి సమీప ప్రాంతాల ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితులు దాపురించాయి. నియమ, నిబంధనల మేరకు పేలుళ్లు జరగడం లేదు. కంపెనీ విధించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ఎక్కువ మోతాదులో బాంబులు పేల్చి అధిక మొత్తంలో బొగ్గును వెలికితీసి పై అధికారుల మెప్పు పొందేందుకు ఇక్కడి అధికారులు పనిచేస్తున్నట్లుగా కనపడుతోంది. ఇందుకు ఉదాహరణే సోమవారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2 జరిగిన సంఘటన బట్టి తేటతెల్లమవుతోంది. సోమవారం మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో కిష్టారం ఓసీలో తీవ్రతతో బాంబు బ్లాస్టింగ్ జరిగింది. దీంతో సమీపంలోని కిష్టారం ఎస్సీ కాలనీలోని గొల్లమందల చిట్టెమ్మ ఇంటి శ్లాబు పెచ్చులు ఊడిపడి చిట్టెమ్మ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. శ్లాబు పెంకులతో ఇల్లంతా నిండిపోయిందంటే బాంబుల తీవ్రత ఏ మేరకు ఉందో అర్థచేసుకోవచ్చు. ఆ ఇంటి అదృష్టం బాగుండి అప్పటి దాకా ఉయ్యాలో 14 నెలల వయసున్న చిట్టెమ్మ మనురాలిని ఒళ్లు కడిగేందుకు బయటకు తీసుకెళ్లారు. లేకుంటే ఆ చిన్నారిపై శ్లాబు పెచ్చులు పడి చిన్నారికి ప్రమాదం జరిగుండేది. ఈ ప్రమాదం నుంచి పాప బయట పడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
భారీ పేలుళ్లతో బెంబేలెత్తుతున్న సమీప ప్రాంతాల ప్రజలు....
సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత కోసం ఉపయోగిస్తున్న బాంబ్ బ్లాస్టింగ్ తీవ్రత అధికంగా ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్, మండలంలోని కిష్టారం, రేజర్ల ప్రాంతాల ప్రజలకు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్స్ శాపంగా మారింది. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్నగర్ కాలనీకి చెందిన బాధితుడొకరు ఇదే విషయమై కోర్టు మెట్టు ఎక్కగా కోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు ఇండ్ల మరమ్మతుల చేయించాలంటూ రూ. 42కోట్లు జరిమానా విధించింది. ఆ డబ్బులు ఖర్చు చేసేందుకు సింగరేణి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ బ్లాస్టింగ్స్ తీవ్రతను తగ్గించి ప్రభావిత ప్రాంతాల ప్రజల ప్రాణాలను రక్షఙంచాల్సిందిగా బాధిత ప్రజలు కోరుతున్నారు.