Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 94 మంది కానిస్టేబుళ్లకు స్థాన చలనం
- ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లా మావోయిస్ట్ ప్రభావిత పోలీస్ స్టేషన్లు, ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో పదవీ కాలం పూర్తయిన కానిస్టేబుళ్లకు బదిలీ ప్రక్రియ చేపట్టారు. 7 పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ పదవీకాలం పూర్తి చేసుకున్న 94 మంది కానిస్టేబుళ్లకు మంగళవారం వారు ఎంచుకున్న పోలీస్ స్టేషన్ల ప్రకారం పోస్టింగులు కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, ఆళ్లపల్లి, బోడు, ఏడూళ్ల బయ్యారం, కోమరారం, గుండాల పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ పదవీకాలం ముగిసిన 94 మందికి జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 2 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న 33 మందికి, ఏజెన్సీ ప్రాంతంలో 3 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న 61 మంది కానిస్టేబుళ్లకు వారు ఎంచు కున్న ప్రకారం పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. పోలీసు శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది విధుల నిమిత్తం తమరిని ఎక్కడ కేటాయించినా క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కెఆర్కె ప్రసాద్, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ షరీఫ్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.